Minister | దేశానికి ఆదర్శంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Minister | దేశానికి ఆదర్శంగా రాజన్న ఆలయ అభివృద్ధి

  • గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం
  • మంత్ర సీతక్క

Minister | వేములవాడ, ఆంధ్రప్రభ : భారతదేశంలోనే ఆదర్శవంతమైన ఆలయంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గిరిజన శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శించుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అభివృద్ధి కోసం ఏటా వందకోట్లు ఇస్తానని మాట తప్పారని గుర్తు చేశారు. అభివృద్ధిని విస్మరించిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఆందోళనకరమైన ప్రకటనలు చేయడం విడ్డూరమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని సుందరీకరిస్తున్నామన్నారు.

వందలాది కోట్ల నిధులతో రాజన్న క్షేత్రంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నిధులు కేటాయించామన్నారు. రాజన్న ఆలయం తోపాటు పట్టణ ప్రధాన రహదారి వెడల్పు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రాబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

పాత వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.ప్రజలకు కనుమ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. ఆమె వెంట వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply