జిల్లాలో ఇసుక దందాపై ఉక్కుపాదం

జిల్లాలో ఇసుక దందాపై ఉక్కుపాదం

  • 9 మంది అరెస్ట్ – 5 గురు రిమాండ్
  • అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై కఠిన చర్యలు తప్పవు

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలపై పోలీసు ఉక్కు పాదం మోపుతోందని బైంసా ఏ ఎస్ పి సాయి కిరణ్ అన్నారు. బాసర కేంద్రంగా చేసుకొని అక్రమ ఇసుక రవాణా తోపాటు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏ ఎస్ పి తెలిపారు. అక్రమ ఇసుక నిందితులు ఉపయోగిస్తున్న సెల్ఫోన్లతోపాటు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు, జెసిబి ని స్వాధీనం చేసుకున్నట్లు ఏ ఎస్ పి పేర్కొన్నారు.

వాటికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ… జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆదేశాల మేరకు అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై నిర్మల్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు ఇందులో భాగంగా బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐచర్ వాహనం, ఒక జేసీబీ ఒక టూ వీలర్ ను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, ధర్మాబాద్ ప్రాంతం నుండి బాసర – నిజామాబాద్ వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, ఒక ఐచర్ వాహనం ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీటిలో ఒక లారీలో 35 టన్నులు, మరో లారీలో 25 టన్నులు, ఐచర్ వాహనంలో 18 టన్నుల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా ఇసుక లోడింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక జేసీబీ , ఒక టూ వీలర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, అందులో 5 మందిని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. మిగిలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

పట్టుబడిన ఇసుక విలువ సుమారు రూ.1,01,400గా అంచనా వేయబడింది. ఇందులో ఒక లారీ, ఒక ఐచర్ వాహనాన్ని బిద్రెల్లి చెక్‌పోస్ట్ వద్ద, మరో లారీని ట్రిపుల్ ఐ టి బాసర మైలాపూర్ రోడ్డుమధ్య పట్టుకున్నారు. ధర్మాబాద్ ప్రాంతానికి చెందిన షేక్ రౌఫ్ కొంతమంది వ్యక్తులతో కలిసి ముఠాగా ఏర్పడి గతంలో కూడా పలు వ్యవస్థీకృత నేరాల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతనిపై నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాసర పోలీస్ స్టేషన్ – PDS బియ్యం అక్రమ రవాణా కేసులు2, భైంసా టౌన్ పోలీస్ స్టేషన్ – PDS కేసు 1, ఇతర కేసులు, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ – దోపిడీ కేసు: 1, ధర్మాబాద్ పోలీస్ స్టేషన్ (మహారాష్ట్ర) – అటెంప్ట్ మర్డర్ బాడిలీ ఆఫెన్సెస్ కేసులు: 4

షేక్ రౌఫ్ అతనికి సహకరిస్తున్న వ్యక్తులు కలిసి PDS అక్రమ రవాణా, ఇసుక రవాణా ఇతర స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌గా గుర్తించబడిన నేపథ్యంలో, వారిపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు నమోదు చేసి గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు., షేక్ రౌఫ్ అతని గ్యాంగ్‌పై తానూర్ పోలీస్ స్టేషన్‌లో ఇసుక అక్రమ రవాణాపై కేసు నమోదు చేయబడింది. ఈ ఆపరేషన్‌ను భైంసా ఇంచార్జి ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ పర్యవేక్షణలో నిర్వహించారు.

సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ఏఎస్ఐలు లింగురాం, గంగాధర్, శామ్యూల్ సిబ్బంది వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భైంసా ఇంచార్జి ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, నిల్వ, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply