ఢిల్లీ : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాక్ పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశిథరూర్ ఉన్నారు.ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్(భాజపా), బైజయంత్ పాండా (భాజపా) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం ఏడు గ్రూపులు 10రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈవిషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృంద సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం. వీరు ముఖ్యంగా ఐదు అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు.
- ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్థాన్ ను రెచ్చగొట్టే చర్యలు.
- పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను ఎలా చేపట్టిందో వివరణ.
- భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత.
- ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనివ్వడం.
- ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించడం.