ఎస్టీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపొద్దు..

ఎస్టీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపొద్దు..
విజ్ఞాన్ వర్సిటీలో ఉచితంగా చదివిస్తాం..
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ. ..
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎస్టీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపొద్దు… విజ్ఞాన్ వర్సిటీలో ఉచితంగా చదివిస్తామని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ నిచ్చారు. శనివారం నరసరావుపేట ఎస్ ఎస్ ఎన్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన ఎస్టీ విద్యార్థులకు ఘనంగా అభినందన సభ నిర్వహించారు. 600 పైబడి మార్కులు సాధించిన 287 మంది విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచిత విద్యావకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నదే తమ సంకల్పమని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఎస్టీ ప్రతిభావంతులను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 600 పైబడి మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టి) చెందిన విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీటు కల్పించి, ఉచిత విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని, ధైర్యంగా పై చదువులకు పంపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. అందులో ఏకంగా 287 మంది (83% పైగా) ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమని ఎంపీ కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులకు, రాత్రింబవళ్లు కష్టపడి వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కనీసం డిగ్రీ వరకు చదివించాలి…..!
ఎస్టీ కుటుంబాల నుంచి ఒక్కో గ్రామానికి కనీసం నలుగురు చొప్పున చదువుకొని ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలన్నదే తమ కోరికని ఎంపీ ఆకాంక్షించారు. వారిని చూసి గ్రామంలోని మరో పది మంది స్ఫూర్తి పొంది చదువుకుంటారని చెప్పారు. ఎస్టీ విద్యార్థులు కనీసం డిగ్రీ వరకైనా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సులువవుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపై నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని స్థానిక ఉపాధ్యాయులు..ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ.. నరసరావుపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా ఆర్ జె డి పద్మ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి నీలావతి దేవి, డి ఈ సి సభ్యులు కె వేణు, కె టి టి వి రమణ, యు. రవి, 200 మంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు పాల్గొన్నారు.
