18th Zone | దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

18th Zone | దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

విశాఖ కేంద్రంగా జూన్ ఒక‌టో తేదీ నుంచి కార్యకలాపాలు
దేశంలో 18వ రైల్వే జోన్‌గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గుర్తింపు
గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి

18th Zone | అమ‌రావ‌తి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కల సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త జోన్ 2026, జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో, భారతీయ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్‌గా అవతరించనుంది.

18th Zone | పునర్విభజన చట్టం హామీ మేర‌కు..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో ఇచ్చిన హామీ మేరకు ఈ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కొత్త జోన్ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వస్తాయి. అదేవిధంగా, ప్రస్తుత వాల్తేరు డివిజన్‌ను విభజించి, దానిలోని కొంత భాగాన్ని విశాఖపట్నం డివిజన్‌గా ఏర్పాటు చేసి కొత్త జోన్‌లో కలుపుతారు. మిగిలిన భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ను ఏర్పాటు చేసి, దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉంచుతారు. కొత్తగా ఏర్పడే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో రాష్ట్రంలోని ప్రధాన డివిజన్లను చేర్చారు. విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్లు డివిజన్, ఈ మూడు డివిజన్లు ఇకపై విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తాయి. దీనివల్ల పరిపాలనా నిర్ణయాలు వేగవంతం కావడమే కాకుండా, స్థానిక అవసరాలకు అనుగుణంగా రైళ్ల రాకపోకలు, కొత్త ప్రాజెక్టుల కేటాయింపులో ప్రాధాన్యత లభించనుంది.

18th Zone | రవాణా రంగంలో పెను మార్పులు..

2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ జోన్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసింది. అయితే సాంకేతిక కారణాలు, భూసేకరణ , ఇతర పరిపాలనాపరమైన చిక్కుల వల్ల కొంతకాలం ప్రాజెక్టు నెమ్మదించింది. చివరకు 2025 జనవరిలో సమగ్ర ప్రాజెక్టు నివేదికకు కేంద్రం ఆమోదం తెలిపింది. అదే నెలలో ప్రధానమంత్రి చేతుల మీదుగా జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రస్తుతం విశాఖలోని వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జీఎం కార్యాలయం ఏర్పాటు కాగా, ముడసర్లోవ వద్ద శాశ్వత భవన నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జూన్ 1న అధికారికంగా జోన్ అమలులోకి రానుండటంతో ఏపీ రవాణా రంగంలో పెను మార్పులు రానున్నాయి.

18th Zone | కార్యకలాపాలకు సర్వం సిద్ధం..

జోన్ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. జోన్ నిర్వహణలో కీలకమైన ఉన్నతాధికారుల నియామకం కూడా పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, వీరంతా ఇప్పటికే తమ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది.

18th Zone | ఉద్యోగుల ఉత్సాహం.. వేల సంఖ్యలో దరఖాస్తులు..

విశాఖ జోన్‌లో పనిచేసేందుకు రైల్వే ఉద్యోగులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా దాదాపు 3,000 మంది ఉద్యోగులు విశాఖ జనరల్ మేనేజర్ కార్యాలయం పరిధిలో పనిచేయడానికి మొగ్గు చూపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జోన్ మొత్తం పరిధిలో సుమారు 17,000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. కాగా, కేవలం విశాఖలోని జీఎం కార్యాలయానికే 1200 మంది ఉద్యోగులు కావాలి. ఇప్పటికే 959 మంది బదిలీకి ఆమోదం లభించింది. ఒడిశాలోని రాయగడ, ఖుర్దా డివిజన్లలో పనిచేస్తున్న వేలాది మంది తెలుగు ఉద్యోగులు విశాఖ జోన్‌కు రావాలని తహతహలాడుతున్నారు. ఒకవేళ కేకే లైన్ రాయగడ డివిజన్ లోనే ఉంటే, తెలుగు ఉద్యోగులు తమ సమస్యల కోసం అక్కడికే వెళ్లాల్సి వస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కేవలం ఒక కార్యాలయం ఏర్పాటు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రయాణం రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది.

CLICK HERE TO READ MORE : tvk108 | ఎమ్మెల్యేల్ని కాడుకునేందుకు టీవీకే యత్నాలు

CLICK HERE TO READ MORE :

Leave a Reply