సర్దార్ గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయం..
మాజీ మంత్రి దేవినేని ఉమా
గొల్లపూడిలో లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు
(విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ) : బడుగు, బలహీన వర్గాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. లచ్చన్న జయంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐదు సార్లు శాసనసభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించిన లచ్చన్న పేదలు, అణగారిన వర్గాలు, రైతుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేశారని దేవినేని ఉమా పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన తెగువ, సాహసం, కార్యదక్షతను గుర్తించిన ప్రజలే ఆయనకు ‘సర్దార్’ అనే బిరుదును అందించారని తెలిపారు.
స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతి కోసం పోరాడిన లచ్చన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం శ్రీకాకుళం నుంచి మద్రాస్ వరకు పాదయాత్ర చేసి రైతుల గొంతుకను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పదవులను సైతం త్యాగం చేసిన ఆయన వ్యక్తిత్వం ఆదర్శ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తన రాజకీయ గురువు ఎన్.జి.రంగా కోసం ఎంపీ పదవికి సైతం రాజీనామా చేసిన గొప్ప నాయకుడు లచ్చన్న అని కొనియాడారు.
సర్దార్ గౌతు లచ్చన్న సేవలను గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. లచ్చన్న చూపిన మార్గంలో పయనిస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
