ఘనంగా ముగిసిన వరుణ యాగాలు…
కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా పూజలు..
లోకకల్యాణం కోసం ప్రత్యేక యాగాలు..
సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో త్రయాహ్నిక క్రతువులు
ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో మహా పూర్ణాహుతితో భక్తిశ్రద్ధల మధ్య ముగింపు
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకుని రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా నిర్వహించిన త్రయాహ్నిక వరుణ యాగములు, వరుణ జపములు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామ్‌చంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈఓ వీకే సీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా ఈ క్రతువులను నిర్వహించారు.
కృష్ణాజలాలతో ఘటాల ఊరేగింపు….
ముగింపు రోజున ఆదివారం ఉదయం 6.30 గంటలకు దుర్గాఘాట్ వద్ద అర్చక స్వాములు, వేద పండితులు, వేదపాఠశాల విద్యార్థుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర కృష్ణానదీ జలాలను ఘటాలలో సేకరించారు. అనంతరం విద్యార్థులు, అర్చకులు ఆ ఘటాలను శిరస్సుపై ధరించి మంగళవాయిద్యాలు, వేద ఘోషల నడుమ ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల వేద మంత్రోచ్ఛారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం 7 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాస పారాయణం నిర్వహించారు. 7.30 గంటల నుంచి కృష్ణానదీ జలాలతో స్వామివారికి ఘటాభిషేకం నిర్వహించి, అనంతరం శత అనువాహక, కారక పారాయణాలు, మండప దేవతా హోమాలు, జయాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

మహా పూర్ణాహుతితో సంపూర్ణమైన క్రతువు..
ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాత యాగశాల వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణలు, కర్పూర హారతుల మధ్య మహా పూర్ణాహుతి నిర్వహించారు. దీంతో ఆగస్టు 14 నుంచి మూడు రోజులుగా కొనసాగిన వరుణ యాగాలు, వరుణ జపములు సంపూర్ణమయ్యాయి. ముగింపు కార్యక్రమంలో ఆలయ ఈఓ వీకే సీనా నాయక్, స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మతో పాటు ఇతర వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
