డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం…
డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం..
నిధులు మంజూరు చేయించి పనులు చేపడతాం
ఎమ్మెల్యే గద్దె రామమోహన్
12వ డివిజన్‌లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
(విజయవాడ, ఆంధ్రప్రభ) : తూర్పు నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ కాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్లే సమస్య తీవ్రతరమైందని విమర్శించారు. శనివారం 12వ డివిజన్ వెంకట గణేష్‌నగర్ సచివాలయం పరిధిలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ డోర్–టు–డోర్ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ… రహదారుల నిర్మాణం పూర్తయినా డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. కాలువల్లో పూడిక తొలగిస్తేనే మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతుందని, గత ఐదేళ్లలో పూడిక తొలగింపుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. నగరంలోని ప్రజాప్రతినిధులంతా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సైడ్ కాలువలు, భూగర్భ డ్రైనేజీకి ప్రత్యేక నిధులు కోరగా, డీపీఆర్ సిద్ధం చేసి ఇస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
ప్రస్తుతం అధికారులు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారని, అది పూర్తికాగానే నిధులు మంజూరు చేయించుకుని పనులు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అబ్దుల్ కరీమ్, ముమ్మనేని ప్రసాద్, పఠాన్ హయత్‌ఖాన్, చలసాని రమణ, మాదాల చిన్నతల్లి, అన్వర్, మేదరమెట్ల నారాయణ, బుర్రా బాలు, కోడి సాంబశివరావు, అక్బర్, శ్రీనివాస్, వీరమాచినేని రంగారావు, పఠాన్ బాజీ, రాజేశ్వరి, ఈఈ రామారావు, డీఈ స్వరూప తదితరులు పాల్గొన్నారు.
