గుండెపూడిలో ఘనంగా ముత్యాలమ్మ పండుగ వేడుకలు

  • బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించిన మహిళలు

మరిపెడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపూడి గ్రామంలో ముత్యాలమ్మ పండుగ వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలు, ముత్యాలమ్మ ఘటాలను తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించిన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో గ్రామంలోని మహిళలు, యువత, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.