Market Value Revision | తెలంగాణలో భూ ధరల సవరణ..!
Market Value Revision | తెలంగాణలో భూ ధరల సవరణ..
- రేపటి నుంచే అమల్లోకి..
- ఏ ఏరియాలో ఎంత పెరిగిందంటే..?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త భూముల ధరలు రేపటి నుంచి (జూన్ 5వ తేదీనుంచి) శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రాంతాల వారీగా భూముల విలువలను 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ప్రైమ్ ఏరియాల్లో భూముల మార్కెట్ విలువలను 100 శాతం వరకు పెంచినట్లు వెల్లడించారు. ఇప్పటికే మార్కెట్ విలువలు చాలా ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ఎలాంటి పెంపు ఉండబోదని తెలిపారు.
భూముల మార్కెట్ విలువల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి. అయితే భూముల మార్కెట్ విలువలు పెంచినప్పటికీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేశారు. భూముల ధరల పెంపు వల్ల రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
అసైన్డ్ భూముల అంశంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి త్వరలో సమగ్ర విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. గతంలో అసైన్డ్ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్ల కారణంగా వాటిని ప్రస్తుతం ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చినట్లు మంత్రి వివరించారు.

