వాటర్ మెనిఫెస్టేషన్ అంటే ఏమిటి? నిజంగా నీళ్ల‌కు అంత శ‌క్తి ఉందా..?

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: ఒక గ్లాసు నీరు.. మనసులో ఒక కోరిక.. దాన్ని పదే పదే ఊహించుకోవడం. అంతే.. మనం కోరుకున్నది నిజమవుతుందా? సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న ‘వాటర్ మెనిఫెస్టేషన్’ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో పెరిగింది. ముఖ్యంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ శ్రీ గౌరీప్రియ ఈ విధానం గురించి మాట్లాడటంతో నెట్టింట ఈ టాపిక్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ వాటర్ మెనిఫెస్టేషన్ అంటే ఏమిటి?
‘మెనిఫెస్టేషన్’ అంటే మనం సాధించాలనుకున్న లక్ష్యం లేదా కోరుకున్న విషయాన్ని మనసులో స్పష్టంగా ఊహించుకోవడం, దానిపై దృష్టి పెట్టడం, పాజిటివ్‌గా ఆలోచించడం. ఇందులో నీటిని ఒక ప్రతీకగా ఉపయోగించే పద్ధతినే సాధారణంగా వాటర్ మెనిఫెస్టేషన్ అంటారు.

ఈ ట్రెండ్‌లో ఒక సాధారణ పద్ధతి ప్రకారం.. మన ప్రస్తుత పరిస్థితి, మనం కోరుకునే పరిస్థితి అని రెండు వేర్వేరు విషయాలను రాసుకుంటారు. రెండు గ్లాసులను తీసుకుని ఒకదానిని ‘ప్రస్తుత పరిస్థితి’, మరొకదాన్ని ‘కోరుకున్న పరిస్థితి’గా భావిస్తారు. మొదటి గ్లాసులోని నీటిని రెండో గ్లాసులోకి పోస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి తాను కోరుకున్న స్థితికి మారుతున్నట్లు ఊహించుకుంటారు. అనంతరం ఆ నీటిని తాగుతూ తాము సాధించాలనుకున్న విషయాన్ని మనసులో విజువలైజ్ చేస్తారు. ఈ పద్ధతినే ‘2 Cups Method’ అని కూడా పిలుస్తారు.

నీటికి నిజంగా అంత శక్తి ఉందా?

ఇక్కడే అసలు విషయం ఉంది. వాటర్ మెనిఫెస్టేషన్‌ను పాటించే కొందరు నీరు మన ఆలోచనలు, ఉద్దేశాలను ‘గ్రహించి’ వాటిని మన జీవితంలోకి తీసుకువస్తుందని నమ్ముతారు. అయితే **నీటిలో మన కోరికలను నమోదు చేసి అవి నిజమయ్యేలా చేసే ప్రత్యేక శక్తి ఉందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు.

అయితే ఈ ప్రక్రియలోని విజువలైజేషన్, పాజిటివ్ అఫర్మేషన్స్, ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం వంటి అంశాలు మన ఆలోచనా విధానంపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు.. ప్రతిరోజూ ‘నేను ప్రశాంతంగా ఉండగలను’, ‘నేను నా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నాను’ వంటి అఫర్మేషన్స్ చెప్పుకోవడం మన దృష్టిని లక్ష్యంపై నిలిపే ఒక మైండ్‌ఫుల్‌నెస్ రొటీన్‌గా ఉపయోగపడొచ్చు. నీటితో అఫర్మేషన్స్ చెప్పే విధానం కూడా ఇటీవల వెల్‌నెస్ ట్రెండ్‌గా ప్రచారం పొందుతోంది.