అంగన్వాడీ టీచర్లు, కార్మికుల అరెస్టుపై ఖండన

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోలేరు: సీఐటీయూ జిల్లా కోశాధికారి

పరకాల, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన సందర్భంగా అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామికవాదులంతా ఖండించాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు.

అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షురాలు, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు దుర్గం రజిత, పోరెడ్డి సమ్మక్క, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు బస్సు ఈశ్వర్‌లను తెల్లవారుజామున వారి ఇళ్లలోకి వెళ్లి పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

అనంతరం వారిని పరకాల పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆత్మకూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. మహిళలు అని కూడా చూడకుండా తెల్లవారుజామున ఇళ్లలోకి చొరబడి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బొట్ల చక్రపాణి అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యాన్ని ఏడో గ్యారంటీగా ప్రకటించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా అక్కడి కార్మికులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోవచ్చని భావిస్తే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన బాటలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడుస్తున్నట్లవుతుందని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఆ పార్టీకి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.