భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
భూపాలపల్లిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 15వ వార్డుల సంయుక్త వార్డు సభను ఫకీర్‌గడ్డ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రజలకు అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వార్డు సభల ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు సూచించిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా నిలపాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం వార్డుల ప్రజల నుంచి వినతులు, సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ , అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
