AISF | గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సరికావు

AISF | గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సరికావు
Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్(Private Schools, Intermediate), డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘాలు ఇటీవల కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన కార్యక్రమంలో విద్యార్థి సంఘాలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు విద్యార్థి సంఘాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు అన్నారు.
ఈ రోజు నగరంలోని ఏఐఎస్ఎఫ్(AISF) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ల్యాదల్ల శరత్ (ఏఐఎస్ఎఫ్), అర్జున్ (పీడీఎస్ యు), యారా ప్రశాంత్(Yara Prashanth) (ఎస్ఎఫ్ఐ)లు రోహిత్ (ఏఐఎస్బి) మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కరు చేసిన చిన్న పొరపాటును అన్ని విద్యార్థి సంఘాలకు ఆపాదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
విద్యార్థి సంఘాలు(Student Unions) విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాయి. కానీ యజమాన్యాలు విద్యార్థి సంఘాలకు మాకు ఏం సంబంధం అని మాట్లాడటం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికే యజమాన్యాలు అన్ని విద్యార్థి సంఘాలను కలిపి ఒకే ఘాటున కట్టి సమాజంలో విద్యార్థి సంఘాల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
విద్యార్థి సంఘాలను బిచ్చగాళ్లంటూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అంతటితోటే ఆగకుండా పరిధి దాటి విచక్షణ కోల్పోయి మాట్లాడటం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మేం బాధ్యులం కాదు అని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారథి, రాకేష్, అంజత్, శరత్, లడ్డూ, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.
