రూ.15 కోట్ల టెండర్ రద్దు చేయాలని ఫిర్యాదు
- మున్సిపల్ పాలకవర్గానికి సమాచారం లేకుండా నోటిఫికేషన్ జారీ
- అదనపు కలెక్టర్‌కు వైస్ చైర్మన్, కౌన్సిలర్ల వినతి
మోత్కూర్, ఆంధ్రప్రభ: మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.15 కోట్ల నిధులకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్నతో పాటు ఏడుగురు కౌన్సిలర్లు సోమవారం స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ఎ. భాస్కర్‌రావుకు ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు ముందే రూ.15 కోట్ల నిధులు మంజూరైనా, పాలకవర్గం ఏర్పడిన అనంతరం పలు అభివృద్ధి పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించేలా సింగిల్ టెండర్ పిలిచారని ఆరోపించారు. దీనిని పాలకవర్గం వ్యతిరేకించడంతో గతంలో కౌన్సిల్ మెజారిటీ తీర్మానం మేరకు ఆ టెండర్ రద్దయిందని తెలిపారు.
ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్‌తో కుమ్మక్కై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, పాలకవర్గ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారని ఆరోపించారు.
సింగిల్ టెండర్ విధానం వల్ల అభివృద్ధి పనుల్లో అవినీతి, అక్రమాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం మేరకు మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టి, రూ.15 కోట్ల నిధులను వినియోగించాలని కోరారు. అలాగే ప్రతి పనికి వేర్వేరుగా టెండర్లు పిలిచి పారదర్శకంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వెంటనే టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి సమగ్ర విచారణ జరపాలని అదనపు కలెక్టర్‌ను కోరగా, ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో కౌన్సిలర్లు కారుపోతుల వెంకన్న, బీసు శ్రీకాంత్, కూర్మిళ్ల ప్రమీల, మెంట రమణ, నల్ల మధు, సుల్తాన్ స్వామి, కొండ శోభ సోమల్లు తదితరులు ఉన్నారు.
