సమగ్ర, స్వచ్ఛమైన ఓటరు జాబితా లక్ష్యంగా సర్
క్షేత్రస్థాయిలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచన
జిల్లా వ్యాప్తంగా 94.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితాలో కచ్చితత్వం ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకమని, అర్హులైన ఏ ఒక్క ఓటరూ జాబితా బయట లేకుండా.. అనర్హులెవరూ జాబితాలో లేకుండా స్వచ్ఛమైన, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో సర్ ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతోందని.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో 16,27,555 (94.99 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, అదేవిధంగా 2,48,289 ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఫారాల పంపిణీని పూర్తిచేయడంతో పాటు డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
తిరువూరులో 1,98,510 (95.11 శాతం), విజయవాడ పశ్చిమ 2,45,154 (95.4 శాతం), విజయవాడ సెంట్రల్ 2,64,918 (95.36 శాతం), విజయవాడ తూర్పు 2,57,753 (95.56 శాతం), మైలవరం 2,63,561 (92.42 శాతం), నందిగామ 1,96,847 (94.87 శాతం), జగ్గయ్యపేట 2,00,812 (96.73 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. బీఎల్‌వోలు, అధికారులు ఈసీఐ నియమనిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి ప్రభావాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా నిబద్ధతతో సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
ఓటర్ల సేవలో 1950 హెల్ప్‌లైన్..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లకు మెరుగైన సేవలు అందించేందుకు భారత ఎన్నికల సంఘం హెల్ప్‌డెస్క్ (1950 హెల్ప్ లైన్) అందుబాటులో ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం, సమస్యల పరిష్కారం కోసం ఈ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఓటరు నమోదు, ఓటరు జాబితాకు సంబంధించిన సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించుకోవచ్చన్నారు.
