Telangana Rains | తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక
Telangana Rains | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడడంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.
పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసినట్లు వెల్లడించారు. రాజధాని హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఐటీ కంపెనీలకు కీలక సూచనలు చేసింది. ట్రాఫిక్ రద్దీ, నీటిమునిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులను వీలైనంత ముందుగానే లాగ్‌అవుట్ చేసి ఇళ్లకు పంపాలని సంస్థలకు సూచించింది. అత్యవసరమైతే వర్క్ ఫ్రం హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
