Nalgonda Property Dispute | కన్నకొడుకు బెదిరింపులతో వృద్ధ దంపతుల ఆవేదన..

రక్షణ కల్పించాలంటూ ఆర్డీవోకు వినతి

Nalgonda Property Dispute | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆస్తి వివాదం ఓ వృద్ధ దంపతుల జీవితాన్ని ఆందోళనకు గురిచేసింది. భూమిలో వాటా ఇవ్వకపోతే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తానంటూ కన్నకొడుకే బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ, తమకు రక్షణ కల్పించాలని లేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు ఆర్డీవోను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం, తమ ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచిన అనంతరం, తమ వైద్య ఖర్చుల కోసం మూడు ఎకరాల 11 గుంటల భూమిని తమను చూసుకుంటున్న మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆ భూమిలో కూడా వాటా ఇవ్వాలని పెద్ద కుమారుడు ఒత్తిడి తెస్తూ, ఇవ్వకపోతే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వారు వాపోయారు. గతంలో వీల్‌చైర్‌లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసినప్పటికీ వేధింపులు ఆగలేదని బుచ్చిరెడ్డి తెలిపారు. తాజాగా ప్రాణహాని ఉందని భావించి వేములపల్లి పోలీసులను ఆశ్రయించగా, అక్కడ ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమకు తక్షణ రక్షణ కల్పించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు.