మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత!
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత!
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్కర్నూల్ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వోట్టెం, కుమ్మెర పంప్ హౌస్లను సందర్శించేందుకు సీఎం వస్తున్న తరుణంలో, ఎలాంటి నిరసనలకు అవకాశం లేకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. నాగర్ కర్నూల్, బిజినపల్లి, తాడూరు, తెలకపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు, నాయకులు కొత్త గంగాధర్, ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, వంశీ గౌడ్, కిషోర్ గౌడ్, కుమ్మెర తిరుపతయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మండల కేంద్రాలలో సైతం తెల్లవారుజామున 4 గంటల నుంచే బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు వారిని స్టేషన్లకు తరలించారు. ఇప్పటివరకు దాదాపు 50 మందికి పైగా నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో కార్యకర్తలు, నాయకులు ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట, వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు ఇంతలా ముందస్తు ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని ఛేదిస్తూ తిమ్మాజిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రహదారిపై దహనం చేసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పోలీసుల ఏకపక్ష అరెస్టులపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల మంది పోలీసుల పహారా మధ్య ప్రాజెక్టులను సందర్శించడం సిగ్గుచేటని వారు ఘాటుగా ఆరోపించారు.
