లోకకల్యాణార్థం ఘనంగా వరుణ యాగాలు

మూడు రోజులుగా ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో వరుణ యాగాలు, వరుణ జపాలు
మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన పవిత్ర క్రతువు
కృష్ణానది నుంచి పవిత్ర జలాలతో ఘటాల ఊరేగింపు..
ప్రత్యేక ఆకర్షణగా వేదపాఠశాల విద్యార్థులు
మల్లేశ్వరస్వామికి కృష్ణాజలాలతో ఘటాభిషేకం..
వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకుని రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా నిర్వహించిన వరుణ యాగాలు, వరుణ జపాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.

ఆగస్టు 14 నుంచి 16 వరకు నిర్వహించిన ఈ త్రయాహ్నిక యాగ క్రతువులకు ఆదివారం మహా పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగింపు పలికారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామ్‌చంద్ర మోహన్‌ ఉత్తర్వుల మేరకు నిర్వహించిన ఈ యాగాలను ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట కృష్ణ సీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కృష్ణాజలాలతో ఘటాల ఊరేగింపు..

వరుణ యాగాల ముగింపు రోజు ఆదివారం కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 6.30 గంటలకు దుర్గాఘాట్‌ వద్ద అర్చక స్వాములు, వేద పండితులు, వేదపాఠశాల విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ పవిత్ర కృష్ణానది జలాలను ఘటాల్లో సేకరించారు. అనంతరం కృష్ణాజలాలతో నిండిన పవిత్ర ఘటాలను వేదపాఠశాల విద్యార్థులు, అర్చక స్వాములు శిరస్సుపై ధరించి దుర్గాఘాట్‌ నుంచి ఇంద్రకీలాద్రిపైకి మంగళవాయిద్యాలు, వేద ఘోషల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు క్రమశిక్షణతో నిర్వహించిన ఈ ఘటాల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

మహాన్యాస పారాయణంతో వైదిక కార్యక్రమాలు..

ఆదివారం ఉదయం 7 గంటలకు శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాన్యాస పారాయణాన్ని వైభవంగా నిర్వహించారు. శివనామస్మరణ, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం 7.30 గంటల నుంచి శ్రీ మల్లేశ్వర స్వామివారికి పవిత్ర కృష్ణానదీ జలాలతో ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం శత అనువాహక, కారక పారాయణాలు, మండప దేవతా హోమాలు, జయాదులను వైదిక సంప్రదాయాల ప్రకారం పూర్తి చేశారు.

మహా పూర్ణాహుతితో సంపూర్ణం…

వరుణ యాగాల ముగింపులో భాగంగా ఉదయం 10.30 గంటలకు పాత యాగశాల వద్ద మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, కర్పూర హారతుల మధ్య యాగ క్రతువు సంపూర్ణమైంది. మూడు రోజులుగా కొనసాగిన వరుణ యాగాలు, వరుణ జపాలకు మహా పూర్ణాహుతితో భక్తిశ్రద్ధల మధ్య ముగింపు పలికారు. ఈ పూజా కార్యక్రమాల్లో దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ, ఈఓ శీనా నాయక్ లు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా వేదపాఠశాల విద్యార్థులు..

వరుణ యాగాల ముగింపు కార్యక్రమంలో ఆలయ వేదపాఠశాల విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృష్ణానదీ జలాలతో కూడిన ఘటాలను శిరస్సుపై ధరించి ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకురావడంతో పాటు వేద మంత్రాలను పఠిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల వేద ఘోషలు, సాంప్రదాయ వస్త్రధారణ యాగ క్రతువుకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి.

ముగింపు కార్యక్రమంలో ఆలయ ఈఓ సీనా నాయక్‌, స్థానాచార్యులు వీ. శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్‌ శర్మతో పాటు ఇతర వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో అర్చక స్వాములు పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, అర్చకులు, వైదిక సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష…

వరుణ యాగాల ఫలితంగా కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివారి కృపాకటాక్షాలతో రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆలయ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.