Indrakiladri | ఆషాఢ సారెకు చివరి ఘట్టం..

శ్రావణానికి శ్రీకారం!
ఇంద్రకీలాద్రిపై ముగింపు వేళ భక్తి వెల్లువ
రెండు రోజుల్లోనే సారె సమర్పణకు చివరి అవకాశం
27వ రోజు 37 బృందాలు.. 16,984 మంది భక్తుల రాక
దర్శనాలకు పోటెత్తుతున్న భక్తజనం..
రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు
13 నుంచి శ్రావణ మాస సేవలు..
15న రాజగోపురం వద్ద స్వాతంత్య్ర వేడుకలు


Indrakiladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి నిర్వహిస్తున్న ఆషాఢ సారె ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మవారిని ఆడపడుచుగా భావిస్తూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళా భక్తుల సారె సమర్పణలతో నెల రోజులుగా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈనెల 12తో ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో మంగళ, బుధవారాలు చివరి రెండు రోజులు సారె సమర్పణకు అవకాశం ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.

27వ రోజు.. 17 వేల మంది సారె…

ఆషాఢ సారె ఉత్సవాల్లో భాగంగా సోమవారం 27వ రోజు అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి 37 సారె బృందాల్లో 16,984 మంది మహిళా భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, ఇతర సారె వస్తువులను సమర్పించారు. సారె బృందాలకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత దర్శనం, అనంతరం ఆశీర్వచనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన భక్తులు కూడా వెలగపూడి శంకర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సారె సమర్పించారు. మహామండపంలోని ఆరో అంతస్తులో అమ్మవారికి సారె సమర్పించి భక్తిని చాటుకున్నారు.

చివరి రెండు రోజులు.. ప్రత్యేక క్యూ..

సారె సమర్పించాలనుకునే భక్తులు ముందుగా కనకదుర్గనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకుని అనుమతి పత్రం పొందాలని అధికారులు సూచించారు. సారె తీసుకొచ్చే భక్తుల కోసం రూ.100 భవానీ అనుగ్రహ దర్శనం క్యూలైన్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ క్యూలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, లగేజీ బ్యాగులు, పాదరక్షలను అనుమతించరు. భక్తులు కొండపైకి వెళ్లే ముందే కనకదుర్గనగర్‌లోని ఉచిత డిపాజిట్‌ కౌంటర్లలో వాటిని భద్రపరచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. చివరి రెండు రోజుల్లో రద్దీ దృష్ట్యా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యే కొండ దిగువకు చేరుకోవడం మంచిదని సూచించారు. సర్వదర్శనాలు ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.

ఒక్కరోజులో రూ.4.50 లక్షల విరాళాలు..

సోమవారం ఇంద్రకీలాద్రికి వచ్చిన భక్తుల సంఖ్య భారీగా నమోదైంది. దేవస్థానం రోజువారీ గణాంకాల ప్రకారం 39,761 మంది అమ్మవారిని దర్శించుకోగా, 6,937 దర్శన టికెట్లు విక్రయమయ్యాయి. భక్తులకు 64,856 ప్రసాద యూనిట్లు అందించారు. హుండీ, విరాళాల రూపంలో రూ.4,50,444 ఆదాయం సమకూరింది. 348 సేవలు నిర్వహించగా, 1,163 మంది తలనీలాలు సమర్పించారు. అన్నదానాన్ని 9,861 మంది భక్తులు స్వీకరించారు. ఆషాఢ సారె ముగింపు రోజుల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో దర్శనం, ప్రసాదం, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

12న సారె ముగింపు.. 13 నుంచి శ్రావణ సందడి..

ఆషాఢ సారె ఉత్సవాలు ముగిసిన వెంటనే ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. ఈనెల 12న ఉదయం 8.30 గంటలకు జమ్మిదొడ్డి నుంచి దేవస్థానం సిబ్బంది సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో కుంకుమార్చన, వరలక్ష్మి వ్రతం, ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం తదితర కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈవో వి.కె. శీనా నాయక్‌ అధికారులను ఆదేశించారు.

15న రాజగోపురం వద్ద జెండా వందనం..

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈసారి ప్రధాన రాజగోపురం ప్రాంగణంలో జెండా వందనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందికి అభినందన పురస్కారాలు అందజేయనున్నారు. ఆషాఢ సారె ముగింపు, శ్రావణ మాస ఆరంభం, స్వాతంత్య్ర దినోత్సవం.. వరుసగా మూడు ముఖ్య ఘట్టాలు రావడంతో ఇంద్రకీలాద్రిపై రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో భక్తులకు దర్శనం సులభతరం చేయడం, సౌకర్యాలు కల్పించడం, రద్దీని సమర్థంగా నియంత్రించడమే లక్ష్యంగా దేవస్థానం యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతోంది.