ఊరూరా ఇందిరమ్మ జోరు

ఊరూరా ఇందిరమ్మ జోరు
- వేగంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు
డోంగ్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు డోంగ్లి మండల పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నిర్మాణ దశల వారీగా బిల్లులు మంజూరు చేయడం వల్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇళ్ల నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, ఎంపీడీవో జగదీష్, అనిల్ కుమార్, గృహ నిర్మాణ శాఖ ఏఈ హనుమంత్ పర్యవేక్షణలో పురోగతిలో కొనసాగిస్తున్నారు.
చకచకా బిల్లుల చెల్లింపు
మండలంలోని 13 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో 236 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 226 ఇళ్లకు మార్కింగ్ పూర్తయింది. ప్రస్తుతం 76 ఇళ్లు బేస్మెంట్ దశలో, 36 గోడల దశలో, 74 స్లాబ్ స్థాయిలో, 16 ఇళ్లు ఫినిషింగ్ దశలో ఉన్నాయి. మోఘా గ్రామంలో పూర్తయిన ఇంటిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు.
ఇసుక కొరత సమస్య
ఇసుక కొరత ఇళ్ల నిర్మాణానికి ఆటంకంగా మారుతోంది. స్థానికంగా ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి వస్తోంది. ట్రాక్టర్ ఇసుక ధర రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఉండటంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం పెరుగుతోంది. కుర్ల మంజీరా నది పరిధిలో ఇసుక అందుబాటులోకి వస్తే ఈ భారం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లబ్ధిదారుల ఆనందం

మోఘా గ్రామానికి చెందిన శకుంతల మాట్లాడుతూ.. తమ పాత ఇల్లు కూలిపోవడంతో ఇబ్బందులు పడ్డామని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో మూడు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. మూడు విడతలుగా రూ.4 లక్షలు మంజూరు కావడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే సమక్షంలో గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు.
పేదలకు ఇళ్లు మంజూరు సంతోషకరం

డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పేదలకు ఆశ్రయం లభించిందన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండలంలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు లభించడం సంతోషకరమన్నారు.
