Under-18 Asia Cup Hockey | మన అమ్మాయిలు అదుర్స్

Under-18 Asia Cup Hockey | మన అమ్మాయిలు అదుర్స్
- నౌషీన్ డబుల్ ధమాకా..
- మలేషియాపై భారత్ ఘన విజయం
ఆంధ్రప్రభ : మహిళల అండర్-18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఈరోజు (శనివారం) జరిగిన పూల్-ఎ (Pool A) తొలి మ్యాచ్‌లో భారత్ 2-1 గోల్స్ తేడాతో మలేషియాను చిత్తు చేసింది. 15 ఏళ్ల భారత యువ సంచలనం నౌషీన్ నాజ్ (Nousheen Naz) రెండు అద్భుతమైన గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుంది.
పాయింట్ల పట్టికలో భారత్ స్థానం
ఈ విజయంతో భారత్ 3 పాయింట్లతో పూల్-ఎ లో రెండో స్థానంలో ఉంది. కొరియా జట్టు కూడా 3 పాయింట్లతోనే ఉన్నప్పటికీ, మెరుగైన గోల్స్ తేడాతో (Goal Difference) అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, ఈ టోర్నమెంట్‌లో మొత్తం 8 జట్లు రెండు పూల్స్ (Pool A, Pool B) గా విడిపోయి ఆడుతున్నాయి. పూల్ ఏలో సౌత్ కొరియా, భారత్, మలేషియా, సింగపూర్ జట్లు ఉండగా… పూల్ బి లో జపాన్, చైనా, చైనీస్ తైపీ, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
లీగ్ దశ ముగిసే సమయానికి పూల్-ఎ లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా జూన్ 5న జరిగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. (భారత్ ఇప్పటికే ఒక విజయం సాధించి మంచి స్థితిలో ఉంది). ఇక సెమీఫైనల్స్ మ్యాచ్‌లలో విజయం సాధించిన జట్లు… జూన్ 6న జరిగే ప్రతిష్టాత్మకమైన ఫైనల్‌కు చేరుకుంటాయి.
భారత్ తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ (Next Matches Schedule)
భారత అండర్-18 జట్టు గ్రూప్ దశలో ఆడబోయే తదుపరి మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
- మే 31, ఆదివారం (రేపు): భారత్ వర్సెస్ సౌత్ కొరియా (ఈ మ్యాచ్ పూల్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో నిర్ణయించడంలో అత్యంత కీలకం కానుంది).
- జూన్ 2, మంగళవారం: భారత్ వర్సెస్ సింగపూర్.
నాకౌట్ దశ:
- జూన్ 5 (శుక్రవారం): సెమీఫైనల్స్
- జూన్ 6 (శనివారం): ఫైనల్ మ్యాచ్
