రెండేళ్ళ నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం…
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో…ఎమ్మెల్యే బడేటి చంటి
అర్హులైన వారందరికీ త్వరలోనే పెన్షన్ మంజూరు…ఎమ్మెల్యే బడేటి చంటి
ఆంధ్ర ప్రభ, ఏలూరు : అర్హులందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, రానున్న రోజుల్లో అందుకు అవసరమైన తుది నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. వచ్చే ఆగష్టు నాటికి నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్ల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే ధ్యేయంతో ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోన్న రెండేళ్ళ నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో కొనసాగింది. దీనిలో భాగంగా స్థానిక 18వ డివిజన్‌లో శనివారం ఉత్సహభరిత వాతవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రజల ఆత్మీయ సత్కారాలు, అభిమానుల విజయ హారతులు, పార్టీ శ్రేణుల కోలాహలాల మధ్య కార్యక్రమం ఆధ్యంతం హుషారైన వాతావరణంలో సందడిగా కొనసాగింది. ఈ సందర్భంగా శివాలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈక్రమంలో తమ ప్రాంతానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటిపై అడుగడుగునా మహిళలు పూలవర్షం కురిపించారు. దుశ్శాలువాలతో ముంచెత్తారు. అనంతరం డివిజన్‌లో ఇంటింటికీ వెళ్ళిన ఎమ్మెల్యే చంటి, చిన్నారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ, స్థానిక మహిళల సమస్యలను తెలుసుకుంటూ, కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాల పేరుతో ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేస్తూ, వృద్ధులందరినీ ఆత్మీయంగా పేరుపేరునా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నదీ, లేనిదీ ఆరాతీశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ స్థానికంగా ఎక్కువ మంది పెన్షన్‌ల సమస్యను వినిపించారని చెప్పారు. దీనిపై త్వరలోనే కూటమి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని, అర్హులందరికీ న్యాయం చేస్తుందని భరోసా కల్పించారు. ఒకరి పొట్ట కొట్టి మరొకరికి పెట్టే విష సంస్కృతి కూటమిది కాదని స్పష్టం చేసిన ఆయన, అర్హత కలిగిన వారందరికీ పెన్షన్ సొమ్ములు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక సూపర్ ఎల్‌నినో విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించిన ఎమ్మెల్యే చంటి, నీటివనరులను పొదుపుగా వినియోగించాలంటూ హితవు పలికారు. ఇదేసమయంలో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ దుష్ట పన్నాగాలకు తెరతీసిందని ఎమ్మెల్యే చంటి ధ్వజమెత్తారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాహార దీక్షల పేరుతో వైసీపీ సిద్ధమైందంటూ ఆయన మండిపడ్డారు. గొడ్డలి పార్టీ కుతంత్రాలను విద్యార్ధులే తిప్పికొడతారని, వారే వైసీపీ నాయకుల దుష్ట వైఖరికి తగిన గుణపాఠం చెబుతారంటూ ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలీ, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు పెద్దాడ వెంకట రమణ, లంకపల్లి మాణిక్యాలరావు, ఆర్నేపల్లి తిరుపతి, డివిజన్ ఇన్‌ఛార్జి గరికముక్కు వీరాంజనేయులు పాల్గొన్నారు.
