కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి..
- పశ్చిమలో 28 వార్డులూ గెలవాలి..
- టీడీపీని నంబర్ వన్ చేయాలి
- స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం
- నా రాజకీయ తొలి అడుగు వెంకన్నతోనే..
- నన్ను చేయి పట్టుకుని ప్రజల్లోకి తీసుకెళ్లారు
- పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలే టీడీపీ బలం
- విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ, ఆంధ్రప్రభ : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 28 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న పశ్చిమ నియోజకవర్గాన్ని మొదటి స్థానానికి తీసుకురావాలని, కూటమి పార్టీలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలే టీడీపీకి అసలైన బలమని, వారి స్ఫూర్తితో యువత మరింత చురుగ్గా పనిచేయాలని అన్నారు.
కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధా వెంకన్న మామిడి తోటలో శనివారం పశ్చిమ నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న అధికారికంగా నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో పార్టీ నియమావళిని పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బుద్ధా వెంకన్న జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
వెంకన్నతోనే తొలి అడుగు..
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో తొలి అడుగు బుద్ధా వెంకన్నతోనే పడిందన్నారు. “నా చేయి పట్టుకుని నడిపించి ప్రజలకు చేరువ చేసిన వ్యక్తి వెంకన్న. ఆయన నాకు సోదరుడితో సమానం” అని పేర్కొన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు.
విజయవాడలోని ఏడు నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గంలోనే టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారని కేశినేని చిన్ని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూటమికి బలమైన మద్దతు ఇచ్చారని, ఎంపీగా తనకు భారీ మెజారిటీ రావడంతో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కూడా మంచి మెజారిటీ లభించడంలో వారి పాత్ర ఉందన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
“పశ్చిమ నియోజకవర్గంలోని 28 వార్డులూ గెలవడమే మన లక్ష్యం. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాం. ఇక మొదటి స్థానానికి చేరాలి” అని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి గౌరవించాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. బుద్ధా వెంకన్న వంటి ప్రజల మనిషికి భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు, పదవులు దక్కాలని ఆకాంక్షించారు.
నిబద్ధతతో పనిచేసే నాయకుడు..
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాట్లాడుతూ బుద్ధా వెంకన్నతో తనకు రెండు దశాబ్దాలకు పైగా పరిచయం ఉందన్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకుడిగా వెంకన్నకు గుర్తింపు ఉందని చెప్పారు. తామిద్దరూ ఒకేసారి ఎమ్మెల్సీలుగా శాసనమండలిలో అడుగుపెట్టామని గుర్తుచేశారు.
వెంకన్న పనితీరుపై నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారని అన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మెజారిటీ సీట్లు సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమన్వయంతో ముందుకు సాగాలి..
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ పార్టీ నిర్ణయమే అంతిమమని, అధిష్ఠానం మార్గదర్శకత్వంలో నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బుద్ధా వెంకన్న పార్టీని మరింత బలోపేతం చేస్తారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, అవసరమైతే చిన్నచిన్న త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఐదుగురు డివిజన్ అధ్యక్షులకు సన్మానం..
‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన ఐదుగురు డివిజన్ అధ్యక్షులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వారి సేవలను గుర్తించి బుద్ధా వెంకన్న వ్యక్తిగతంగా రూ.1,74,600 నగదు పురస్కారాన్ని అందజేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను ప్రోత్సహించడం ద్వారా మరింత ఉత్సాహం పెరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పార్టీ కోసం అవసరమైతే నాలుగడుగులు వెనక్కి తగ్గడానికి సిద్ధమని, ప్రత్యర్థుల విషయంలో పది అడుగులు ముందుంటామని అన్నారు. పార్టీ కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
తనకు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు బుద్ధా వెంకన్న కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు షరీఫ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, నాగుల్‌మీరా, బోండా సిద్ధార్థ, గొట్టిముక్కల రఘు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
