కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి.

కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో పర్యాటకశాఖ, పురావస్తు శాఖ అధికారులతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొండపల్లి ఖిల్లా అభివృద్ధికి, కిలా పైకి పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమగ్రంగా చర్చించారు.

ప్రస్తుతం ఖిల్లా పైకి మెట్ల నడక మార్గం, పశ్చిమ ఇబ్రహీంపట్నం వైపు నుంచి రోడ్డు మార్గాలు ఉన్నాయి. కొండపల్లి ఖిల్లా పైకి రోప్ వే మార్గాన్ని కూడా నిర్మించాలన్నారు. అలాగే ఖిల్లాపై లేజర్ షోతో పునః ప్రారంభించాలన్నారు. పర్యాటక శాఖ టూరిజం కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ద్వారా ఖిల్లాకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కొండపల్లి బొమ్మలు, కృష్ణ గోదావరి నదిలో నదుల అనుసంధానం పవిత్ర సంగమం, కొండపల్లి కోట వైభవం, వీటన్నింటి గురించి వివరిస్తూ ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకులను ఆకర్షించాలన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధితో ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కొండపల్లి కూడా ఇప్పటికే అమరావతిలో భాగమైనందున రాజధానికి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా కొండపల్లి కోట, ఖిల్లా, బొమ్మలతో పాటు మన ప్రాంతాన్ని సందర్శిస్తారన్నారు. అంతేకాకుండా సాహస యాత్రకు, పర్వతాల అధిరోహణకు, ట్రెక్కింగ్, ర్యాప్లింగ్ కూడా కొండపల్లి ఖిల్లా అనువుగా ఉన్నందున యువత ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటారని అన్నారు. కొండపల్లిని పర్యాటకం పరంగా సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలు అన్నీ సద్వినియోగం పరుచుకుంటామన్నారు. ఈ విషయంపై తగు ప్రతిపాదనలు రూపొందించి మంత్రి దుర్గేష్ గారితో పాటు, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వెల్లడించారు.

Leave a Reply