వైసీపీ శ్రేణుల వాహనాలను అడ్డుకున్న పోలీసులు..

డోన్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి పిలుపు మేరకు డోన్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు. డోన్ జాతీయ రహదారిపై దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో జాతీయ రహదారి 44పై కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తమ నాయకుడిని చూసేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తమను పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అంతరాయం కారణంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవడం పూర్తిగా అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. పోలీసులు టీడీపీ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.