సాంప్రదాయాలు ఎంతో గొప్పవి..
- బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ భీమ్రావు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ భీమ్రావు అన్నారు. ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున ప్రారంభమై కృష్ణాష్టమి వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహించే బంజారా సంస్కృతిలో అతిపెద్ద పండుగ తీజ్‌ను పురస్కరించుకుని ఆదివారం స్థానిక కొమ్ముగూడ సమీపంలో తీజ్ పాట చిత్రీకరణ నిర్వహించారు.
కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ రచించి, స్వరపరిచి, గానం చేసిన తీజ్ పాటకు బంజారా వేషభూషణాలతో స్థానిక కళాకారులతో వీడియో చిత్రీకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాథోడ్ భీమ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా సంస్కృతిలో అతిపెద్ద పండుగైన తీజ్‌పై వీడియో పాటను చిత్రీకరించడం ఎంతో సంతోషకరమన్నారు. బంజారా సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
ఎం. నాయక్ రవీందర్, రాథోడ్ భీంరావ్ నాయక్, నిర్మాత చవాన్ సేవాదాస్, అర్జున్, రవి, శివానంద, బంజారా యువసేన ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర ఆధ్వర్యంలో స్థానిక కళాకారులతో తీజ్ పండుగ పాటకు సంబంధించిన దృశ్య చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణ ఆసుపత్రి డాక్టర్ క్రాంతి కుమార్ సహాయ సహకారాలు అందించి తీజ్ సంస్కృతి, సాహిత్య జాగృతికి తన వంతు సహకారం అందించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాథోడ్ భీంరావు నాయక్ మాట్లాడుతూ.. బంకట్ లాల్ బంజారా సమాజ సాంస్కృతిక, సాహిత్య సేవలో ముందుంటారని కొనియాడారు. బంజారా తీజ్ సంస్కృతి, సాహిత్యంపై ఎన్నో పాటలు పాడుతూ, తరతరాలుగా వస్తున్న తీజ్ పండుగ పాటలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అభినందించారు. బంకట్ లాల్‌కు సమాజం నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని రాథోడ్ భీమ్రావు తెలిపారు. కార్యక్రమంలో చిత్రకారులు, స్థానిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
