సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి..

ఏలూరు, ఆంధ్రప్రభ : సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తెల్లదొరలను దేశం నుంచి తరిమివేయడంలో సర్దార్ గౌతు లచ్చన్న చూపిన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమన్నారు.

సర్దార్ గౌతు లచ్చన్న గొప్ప సంఘ సంస్కర్త అని, అంటరానితనానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు. అట్టడుగు వర్గాలు, గ్రామీణ సమాజాల అభ్యున్నతికి, వారి హక్కుల కోసం ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. రైతు, కార్మిక పక్షపాతిగా సర్దార్ గౌతు లచ్చన్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.