అచ్చంపేట శివారు తండాలో పులి బీభత్సం

అచ్చంపేట శివారు తండాలో పులి బీభత్సం

  • ఎద్దును చంపి సగం తిన్న పెద్దపులి
  • రైతుకు రూ.80 వేల నష్టం
  • భయాందోళనలో తండావాసులు
  • ఫారెస్ట్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలంటూ డిమాండ్

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం శివారు తండాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. తండాకు చెందిన పేద రైతు పాత్లవత్ మోత్యా నాయక్‌కు చెందిన పొలంలో కట్టేసి ఉన్న పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక పెద్ద ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, పులి దానిని సగం వరకు తినివేసినట్లు గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న మోత్యా నాయక్‌కు ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.

మృతి చెందిన ఎద్దు విలువ దాదాపు రూ.80 వేల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే వ్యవసాయంలో నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో పులి దాడితో కుటుంబం ఆందోళనలో మునిగిపోయిందన్నారు. పెద్దపులి సంచారంతో తండా పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేపాలన్నా భయపడుతున్నామని రైతులు చెబుతున్నారు.

“ఈరోజు పశువులపై దాడి చేసిన పులి రేపు మనుషులపై దాడి చేయదనే హామీ ఏమిటి?” అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల నుంచి క్రూర జంతువులు గ్రామాల్లోకి రాకుండా ఫారెస్ట్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. పొలాల సరిహద్దుల్లో రక్షణ కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే బాధిత రైతుకు వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply