Delhi | తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేనట్లే…

  • పీసీసీ కార్యవర్గ కూర్పుపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన
  • కుల గణన సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం
  • పార్టీ నిర్ణయాలన్నీ అధిష్టానం దృష్టిలోఉంటాయి
  • ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న రేవంత్.. మీడియాతో చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలో తొలగింపులు, చేర్పులపై పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని… తాను ఎవరి పేర్లనూ ప్రతిపాదించలేదన్నారు.

మ‌రోవైపు పీసీసీ కార్యవర్గం కూర్పు ఖరారైందని, రేపటిలోగా ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే ఆషామాషీగా జరగలేదని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా జాగ్రత్తగా చేశామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారని పేర్కొన్నారు. తాము చేప‌ట్టి సర్వేతో ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.

మరోవైపు తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని, తనకు రాహుల్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ తీసుకునే కీలక నిర్ణయాలన్నీ దాదాపు అధిష్టానం దృష్టిలోనే ఉంటాయని తెలిపారు. పార్టీ, నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటాను తప్ప.. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని చెప్పారు.

ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. త్వరగా అరెస్ట్ చేయించి జైలుకి పంపాలనే ఆలోచన లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ చెప్పారు. పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసని.. ప్రతి ఒక్క విమర్శకు తాను స్పందించాల్సిన అవసరం లేదని హాట్ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *