లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్ర్యం..
ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతోంది
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం
మనం అడ్రస్ లేని వాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
కలిసికట్టుగా స్వర్ణాంధ్ర సాధిద్దామని ప్రతినబూనుదాం
విజయవాడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
(పాయికాపురం, ఆంధ్రప్రభ) : కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసి స్వర్ణాంధ్ర సాధనకు ప్రతిన బూనుదామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు దేశం అంతా ఒక్కటే పండుగ. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందరూ కలిసి జరుపుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. ఈ రోజు దేశం మొత్తం జాతీయ జెండా గర్వంగా ఎగురుతుంది. ఆ జెండా మనందరి గుండె చప్పుడు. జెండా పండుగ నాకు ఒక పర్సనల్ ఎమోషన్. ఇక్కడ విద్యార్థులను చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి.

ఇండిపెండెన్స్ డే వస్తుంది అనగానే స్కూల్ లో హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి క్లాస్ రూమ్స్, స్కూల్ ని డెకరేట్ చేసేవాళ్లం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్ర్య సమరయోధుల చరిత్ర గురించి స్టడీ చేసేవాళ్లం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవి. జనగణమన అంటూ జాతీయ గీతం పాడుతూ.. జాతీయ జెండా ఎగరడం చూసినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఆ మూమెంట్ ఈ రోజు మళ్లీ నాకు గుర్తొచ్చింది. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైనే కాదు.. ఈ రోజు ప్రతి భారతీయుడి గుండెల్లో జాతీయ జెండా ఎగురుతుంది.

మువ్వన్నెల జెండా మన ఆత్మ గౌరవం..
అహింస ఆయుధంగా స్వాతంత్ర్యం సాధించింది మహాత్మా గాంధీ. కత్తిపట్టి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీర మహిళ రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్. నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అంటూ యువత దేశం కోసం పోరాడేలా చేసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. కోట్లాది మంది పోరాటం మన స్వేచ్ఛ. లక్షలాది మంది త్యాగం మన స్వాతంత్ర్యం. ఎన్టీఆర్ జిల్లా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టం. ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండానే ఎగురవేయడం నాకు దక్కిన గౌరవం. బ్రిటీష్ వాళ్ల తుపాకీకి ఎదురు నిలబడిన ధైర్యం పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. రంపా రెబలియన్ పేరుతో బ్రిటీష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఆగష్టు 15 కేవలం ఒక తేదీ కాదు.. మన చరిత్రను గుర్తుచేసే రోజు. మన భవిష్యత్ నిర్మించిన రోజు. మూడు రంగుల జెండా మన ఆత్మగౌరవం.

విద్య, కళలకు రాజధాని మన విజయవాడ..
బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉంటే మనకి కొండంత బలం. ఈ జిల్లాకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం కృష్ణా నది. మన సాగు, తాగునీటికి వరం ప్రకాశం బ్యారేజీ. మన బెజవాడ విద్య, కళలకు నిజమైన రాజధాని. ఉండవల్లి గుహలు మన చరిత్ర. కొండపల్లి బొమ్మలు మన కళ. గడిచిన రెండేళ్లు నేను గుంటూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నాను. కానీ ఈ సంవత్సరం మీ అందరికీ అన్నగారు.. నాకు మాత్రమే తాతగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పేరు మీద ఉన్న ఎన్టీఆర్ జిల్లా వేడుకల్లో పాల్గొనడం నాకు దక్కిన అరుదైన గౌరవం.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం..
నేను విద్యాశాఖ మంత్రిని అయినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొస్తానని చెప్పాను. రెండేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారు. కరిక్యులమ్ మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్స్ ఇస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నాం. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా చేశాం. పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి పాఠశాలల వరకు ఎక్కడా నా ఫోటో లేదు, సీఎం గారి ఫోటో లేదు. దేశ చరిత్రలో మొదటిసారి పదో తరగతి పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో ప్రకటన ఇచ్చాం. చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి విలువలు నేర్పిస్తున్నాం. మహిళలను గౌరవించడం నేర్పిస్తున్నాం. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అమ్మకు చెప్పలేని పని ఏమీ చేయొద్దు అని. వినడానికి సింపుల్.. కానీ చాలా పవర్ ఫుల్. మహిళలను గౌరవిస్తేనే సమాజం బాగుంటుందని బలంగా నమ్ముతాను.
యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నాం..
ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత నాకు ఇస్తే.. దేశ తలరాతను మారుస్తానని స్వామి వివేకానంద అన్నారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నా. నాలుగేళ్లు ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం రాదు. నాలుగు నెలలు అమీర్ పేటలో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది. అదే స్కిల్ గ్యాప్. అందుకే నేను పరిశ్రమలు-కాలేజీలను అనుసంధానిస్తున్నాం. పరిశ్రమలు మన ఐటీఐలను అడాప్ట్ చేసుకుని వాళ్లకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పిస్తారు. ఉద్యోగాలు వెంటనే వస్తాయి. అలానే ఉన్నత విద్యను కూడా ప్రక్షాళన చేస్తున్నాం. కరిక్యులమ్ మార్చాం. ఇన్నేళ్లుగా లేని ఫ్రొఫెసర్ రిక్రూట్ మెంట్ చేస్తున్నాం.
నమో ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధి..
కేంద్ర ప్రభుత్వం, మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మనం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇక మనం అడ్రస్ లేనివాళ్లం కాదు.. మన కేరాఫ్ అడ్రస్ అమరావతి. ప్రజారాజధాని అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చారు. పోలవరం పూర్తిచేయడానికి నిధులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుచేశారు.

మన బ్రాండ్ సీబీఎన్..
స్వాతంత్ర్య దినోత్సవం రోజు మన రాష్ట్ర చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. 1953కి ముందు మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అప్పుడు మన రాజధాని చెన్నై. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ దీక్ష చేసిన తర్వాత అక్టోబర్ 1, 1953న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అప్పుడు మన రాజధాని కర్నూలు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు మన రాజధాని హైదరాబాద్. 2014లో అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ముఖ్యమంత్రి కూర్చోడానికి కనీసం కుర్చీ లేదు. రాజధాని లేదు. జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. ఆ రోజు మనకున్న ధైర్యం ఒక్కటే.. మన బ్రాండ్ సీబీఎన్. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని ఇచ్చాం. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి సంస్థలను ఏపీకి తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 2024 వరకు ఏం జరిగిందో మీరంతా చూశారు.
సీబీఎన్ స్పీడ్ అందుకోలేం..
2024లో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. అప్పటి నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనలో ముగ్గురు 25 ఏళ్ల కుర్రాళ్లు, ఏడాది వయసున్న బాబు ఉన్నారని నేను సరదాగా అంటాను. ఆయన స్పీడ్ అందుకోవడం ఎవరివల్లా కాదు. కేబినెట్ లో చాలా మంది యువకులు ఉన్నారు కానీ సీబీఎన్ బుల్లెట్ స్పీడ్ అందుకోవడం చాలా కష్టం. నేను గూగుల్ తీసుకొచ్చాను అనే ఆనందంతో ఆయన దగ్గరికి వెళ్లాను. ఈ రోజు మనకి ఫుల్ మార్క్స్ అనే ఫీలింగ్ లో వెళ్లాను. ఆయన వెరీగుడ్.. బాగా చేశారు అని నెక్స్ట్ మినిట్టే నెక్స్ట్ ఏంటి అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం..
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. రెండేళ్లలో సుపరిపాలన అందించాం. సంక్షేమం-అభివృద్ధి మనకి జోడెద్దుల బండి. పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, చేనేతలకు ఉచిత విద్యుత్, మత్స్యకార భరోసా అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఏర్పాటుచేశాం. మెగా డీఎస్సీ ద్వారా 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. పదివేల పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల చేశాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. ప్రతి వంద రూపాయల పెట్టుబడుల్లో ఏపీకి రూ.25 వస్తున్నాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్స్ కంపెనీలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ ఫీల్డ్.. ఇలా వెయ్యి మెగా ప్రాజెక్ట్స్ ఏపీకి చిరునామాగా చేశాం.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యం..
నేను పాదయాత్రలో మోహన అనే మహిళను కలిశాను. ఆమె 30 ఏళ్లుగా రోడ్డు పక్కన బోండాలు వేస్తూ పిల్లలను చదివించారు. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు ఆమె ఒకటే అన్నారు.. నాకు సంక్షేమ కార్యక్రమాలు వద్దు, నా ఇద్దరి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా కంపెనీలు తీసుకురండి చాలు అన్నారు. ఆవిడ మాటల నుంచి పుట్టిన ఆలోచనే 20 లక్షల ఉద్యోగాలు. నేను, మన సీఎం ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకువస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది నా లక్ష్యం. ఉద్యోగాలు కల్పించడం నా బాధ్యత. కష్టపడి పనిచేయడం మీ బాధ్యత.
సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుని ఎదుగుదాం..
దేశభక్తి ఎంత ముఖ్యమో.. రాష్ట్ర భక్తి కూడా అంతే ముఖ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. 1965, ఆగష్టు 9న మలేషియా నుంచి సింగపూర్ విడిపోయింది. ఒక చిన్న మత్స్యకార దేశం. మన రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు కూడా లేవు. కానీ ఒక నాయకుడు ఆ దేశ చరిత్రను మార్చారు. ఆయనే అప్పటి సింగపూర్ ప్రధానమంత్రి లీ క్వాన్ యూ. మన నిలబడతాం, ఈ దేశాన్ని మనమే స్వయంగా నిర్మించుకుంటాం అని లీ క్వాన్ యూ అన్నారు. ఆయన దేశ ప్రజలకి కొన్ని విషయాలు చెప్పారు. ఇతరులను నిందించడం ఆపాలని, మరింత కష్టపడి పనిచేయాలని, క్రమశిక్షణతో ఉండాలని, దీర్ఘకాలికంగా ఆలోచించాలని, మీ దేశంపై విశ్వాసం ఉంచాలని, అందరం కలిసి దేశాన్ని నిర్మిద్దామని చెప్పారు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభిస్తే.. ఇప్పుడు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచంలోనే తక్కువ జనాభా ఉన్న 28వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అలాంటి గొప్ప ఆలోచనలు ఉన్న నాయకత్వం మనకి కూడా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మనకోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం..
ఒక చిన్న దేశం అద్భుతాలు చేసినప్పుడు.. మనం చేయలేమా? ఇంకెంత కాలం మనం ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే రాష్ట్రాలు వెళ్లాలి? సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుని మనం అభివృద్ధి చెందుదాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అభివృద్ధి నాలో కసి పెంచుతుంది. కేవలం హైదరాబాద్ చెన్నై కాదు.. ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి ఉంది. మన ముఖ్యమంత్రి గారికి విజన్ ఉంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే మన లక్ష్యం. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా అందరి లక్ష్యం ఒక్కటే కావాలి.. అది స్టేట్ ఫస్ట్. అన్ని రంగాల్లో ఏపీ నెం.1 కావాలి.
స్వర్ణాంధ్రను నిర్మిద్దాం…
స్వాతంత్ర్యం పెద్దలు సాధించారు…స్వర్ణాంధ్ర మనందరం కలిసి సాధిద్దాం. ఈ జాతీయ జెండా సాక్షిగా మనం ఒక ప్రమాణం చేద్దాం. నేను కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను, నా రాష్ట్రాన్ని నెం.1గా నిలబెట్టడానికి బాధ్యతగా ఉంటాను అని ప్రమాణం చేద్దాం. స్వర్ణాంధ్ర విజన్ కి తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లా అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. అనంతరం వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను మంత్రి చూశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి రాజశేఖర బాబు పాల్గొన్నారు.
