తెలంగాణలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు
తెలంగాణలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు
- అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చిన నాయకుడు కేసీఆర్
- మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- చైతన్యపురిలో నిరుద్యోగుల నయవంచన సభ
ఆంధ్రప్రభ, గ్రేటర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పోరాటం సాగించడంతో పాటు, అందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్, మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. చైతన్యపురిలో గురువారం నిర్వహించిన నిరుద్యోగుల నయవంచన సభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేసీఆర్ నాయకత్వంలో నాటి తెలంగాణ ప్రభుత్వంలో లక్ష 60 వేల ఉద్యోగాలను ఇచ్చామని, 40వేల ఉద్యోగాలు ప్రాసెస్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆ మిగిలిన ఉద్యోగాల నియామక పత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాయకష్టం చేసి తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశతో నిరుద్యోగుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నార ని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడిన తలసాని, ఈ విషయం రాహుల్‌గాంధీకి సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే అశోక్ నగర్ చౌరస్తాకు రావాలని సవాల్ విసిరిన తలసాని, 4వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, స్కూటీలు ఇస్తామన్నారని, ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ఇంత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చింది లేదని ఎద్దేవా చేశారు.
మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్నారని, హైడ్రా కూల్చివేతలతో ముఖ్యమంత్రిని మహిళలు అనేక తిట్లు తిడుతున్నారని, తనలాంటి వాడైతే ఆ తిట్లకు ఆత్మహత్య చేసుకుంటారని తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందని, ఆగస్ట్ లో సరూర్ నగర్ ప్రాంతంలో లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తను సభ నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎంతో అత్యున్నతమైనదని, ఆ పదవి గౌరవాన్ని దిగజార్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొస్తే, రాజకీయాలు చేయకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆ పథకాన్ని కొనసాగించారని తలసాని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర దొంగల చరిత్ర

కాంగ్రెస్ పార్టీ చరిత్ర దొంగల చరిత్ర అని తలసాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మంత్రుల పదవులు వచ్చాయే తప్ప, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు రాలేదన్న ఆవేదనతో దయచేసి బలి దానాలకు పాల్పడొద్దని యువతకు, నిరుద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో పోరాడతామని ఆయన భరోసానిచ్చారు. బలిదానాలకు పాల్పడటం ద్వారా తల్లిదండ్రులకు కడుపుకోత రానియొద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే వరకు మీ వెంటే ఉంటామని నిరుద్యోగులకు భరోసానిచ్చిన ఆయన, తెలంగాణ రాష్ట్రం కోసం సాగించిన ఉద్యమంలో కేసీఆర్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని కాంగ్రెస్‌ను విమర్శించారు. కనీసం తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతుందని, 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో అనేక అద్భుతాలు జరిగాయని గుర్తు చేశారు.

రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అడిగితే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కేసులకు భయపడే వారెవరూ లేరని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగించిన పోరాట స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దామని, నిరుద్యోగుల సభతో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలు, అబద్ధాలని, ఉద్యోగం రాకుంటే రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారని, నేటి వరకు ఒక్కరికీ కూడా ఇవ్వలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
