అదే నా లక్ష్యం – కవిత..

అదే నా లక్ష్యం – కవిత..
హనమకొండ, ఆంధ్రప్రభ – 20 ఏళ్లుగా బీఆర్ఎస్ లో పని చేస్తే.. కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా నన్ను అవమానకరంగా బయటికి పంపించారని, తాను పక్కా పాలిటిక్స్ చేస్తానని ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఆదివారం బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడారు. పాలకపక్షం, ప్రతిపక్షం పని చేయడం లేదు. ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ లో నన్ను ప్రోటోకల్ పేరుతో నిజామాబాద్ కి కట్టడి చేశారని, టీచర్ ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని రూ 11 వందల నుంచి 1700 కోట్లకు పెంచారని, దీని పై విజిలెన్స్ విచారణ వేసి ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసమానతలు లేని తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యమని చెప్పారు. మహిళలు, విద్యార్థులు, యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావాలని, స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు మళ్లీ మొదలుపెట్టాలి.. అలాంటప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేడు రాష్ట్రంలో నేడు పాలకపక్షం, ప్రతిపక్షం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉంది. ప్రజల తరఫున అడిగేటోళ్లు లేరు. అందుకే మేము ఆ పని చేస్తున్నామని కవిత వెల్లడించారు. బీసీలకు చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా అవకాశం రావాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు. పొలిటికల్ గా బీఆర్ఎస్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని, ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన జిల్లా అని చెప్పారు.
