తెలంగాణ మంత్రి సీతక్కకు బెదిరింపు లేఖ పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖను మావోయిస్టులు ఖండించారు. జూలై 5న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, సీపీఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్, ఆ లేఖను తమ పార్టీ జారీ చేయలేదని స్పష్టంగా తెలిపారు. జూన్ 26న వెలుగులోకి వచ్చిన ఆ లేఖకు తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర కార్యదర్శి బాడే చొక్కారావు లొంగిపోయారన్న వార్తలను కూడా జగన్ ఖండించారు. అవి కేవలం దుష్ప్రచారమని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో మావోయిస్టులపై ఒత్తిడి ద్వారా సమస్యలు పరిష్కరించలేమని చెప్పిందని గుర్తు చేశారు.
ఆదివాసీలపై పోలీసుల వేధింపులపై విమర్శలు
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను పోలీసులు స్టేషన్లకు తీసుకెళ్లి బెదిరిస్తున్నారని జగన్ ఆరోపించారు. అక్కడ మావోయిస్టు కదలికలు లేనప్పటికీ, అనుమానాల పేరిట ఆదివాసీలను వేధిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.