జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..?

జగిత్యాల సభ బీఆర్ఎస్ బహిరంగ సభనా..?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సభనా.
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు ప్రకటించాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం
సభకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం
మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20వ తేదీన నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జీవన్ రెడ్డి చేరిక సభనా లేదా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా ప్రకటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్ లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈనెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు క్లారిటీ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా అక్రమ సంపాదన చేసిన డబ్బుతో జగిత్యాల సభకు జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 12వేల నుండి 15వేల మందితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్ చార్జీని నియమించి జన సమీకరణ చేస్తున్నారన్నారు.

జీవన్ రెడ్డి పార్టీ వేడడం బాధాకరం
సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ వీడడం బాధాకరం. పార్టీ వీడుతున్న జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పనిచేసిందని జీవన్ రెడ్డి అంటున్నారని మరి బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పని చేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి సాధించిందని, పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిందన్నారు.
జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తగదని ఎందుకు రేవంత్ రెడ్డి దిగిపోవాలని ప్రశ్నించారు.
కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చాం
జగిత్యాల సమావేశంలో అధికార పార్టీ సభ నిర్వహణకు ఆటంకాలు కల్పిస్తున్నారని వార్తల్లో నిజం లేదు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తాను స్వయంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కు చెప్పానన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సభలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తు అరెస్టులు చేసి తీసుకువెళ్లే వారిని ఇప్పుడు అలాంటి అరెస్టులు కావడంలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు.
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని జీవన్ రెడ్డి పార్టీ మార్పుతో పెద్దగా నష్టం జరిగేది ఏమీ లేదన్నారు.
అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తా
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ప్రజా ప్రతినిధిగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారని అందరు ప్రజాప్రతినిధులు లాగా తాను కూడా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్గ సహచరులు తనతో ఆప్యాయంగా మాట్లాడుతారని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. జీవన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ ఏనాడు జగిత్యాల లోని రోడ్ల విషయం పట్టించుకోలేదని, జగిత్యాల కరీంనగర్ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పట్టణంలోని పలు రోడ్ల విస్తరణ మరిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఉండేవి. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలోని రోడ్లతో పాటు ప్రధాన రహదారులు విస్తరణ పై దృష్టి సారించాను. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో తాను కలిసి పని చేస్తాను.
