చర్చి స్థలం అమ్మకానికి కుట్ర..

చర్చి స్థలం అమ్మకానికి కుట్ర..
సంఘం సభ్యులను బెదిరింపులు…
కాజీపేట, ఆంధ్ర ప్రభ : ఫెయిత్ హోమ్ చర్చ్ మినిస్ట్రీస్‌ను సొంత లాభాల కోసం అమ్మడానికి కుట్ర చేస్తూ, సంఘం సభ్యులను ఇబ్బందులకు, బెదిరింపులకు గురి చేస్తున్నారని సంఘం ప్రెసిడెంట్ బండి రాజ్‌కుమార్ ఆరోపించారు. కాజీపేట మీడియా పాయింట్‌లో సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2005లో సొసైటీ రిజిస్ట్రేషన్, 2006లో సభ్యుల డబ్బులతో 484 గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్, చర్చి నిర్మాణం జరిగాయన్నారు. పాస్టర్ మిట్టపల్లి రాజమౌళి 2015లో అనారోగ్యం కారణంగా బాధ్యతలు తనకు అప్పగించగా, ఆయన మరణం తర్వాత సంఘం నడిపిస్తున్నామని, రాజమౌళి కుటుంబం తప్పుడు ప్రచారాలు, మరికొందరు కలిసి బెదిరింపులు చేస్తోందని తెలిపారు.
2025లో సొసైటీని చట్టప్రకారం పునరుద్ధరించినా, చర్చి స్థలాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారని, అమ్మకానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. సంఘం సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చర్చిని సొసైటీ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ తెలిపారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ సైమన్, ట్రెజరర్ ఆశీర్వాదం, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సమ్మయ్య, నర్సింగాచారి, అడ్వైజర్లు రాజు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
