దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు

దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ:
స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ కేంద్రం శివారులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో గల ‘సిరి రామ్ మోటార్స్ ఏడీ బ్లూ డీఈఎఫ్ (AdBlue DEF) లిక్విడ్’ షాపులో జరిగిన దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి దోపిడీకి గురైన 26 ఏడీ బ్లూ డీఈఎఫ్ లిక్విడ్ బకెట్లతో పాటు క్రైమ్‌కు ఉపయోగించిన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి. వేణు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు సదరు మోటార్స్ షాపుపై పడి, యజమాని బైర రామ్‌ను తీవ్రంగా బెదిరించారు. అనంతరం అతని వద్ద ఉన్న పర్సుతో పాటు కౌంటర్‌లోని రూ. 10,000 నగదు, 26 ఏడీ బ్లూ డీఈఎఫ్ లిక్విడ్ బకెట్లను బలవంతంగా ఎత్తుకెళ్లారు. బాధితుడు బైర రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఘన్‌పూర్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో గురువారం పోలీసులు మండల పరిధిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. జనగాం వైపు నుంచి హన్మకొండకు వెళ్తున్న TG 04 T 6590 నంబర్ గల బొలెరో వాహనాన్ని ఆపి చెక్ చేశారు. ఆ సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అతడిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించారు. విచారణలో అతని పేరు దినేష్ కుమార్ అని, రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడినని తెలిపాడు. అనంతరం తానే తన ముఠాతో కలిసి సిరి రామ్ మోటార్స్ షాపులో దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని సీఐ వివరించారు.

దీంతో పోలీసులు నిందితుడు దినేష్ కుమార్‌ను అధికారికంగా అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి బొలెరో వాహనాన్ని, రూ. 95,000 విలువైన 26 ఏడీ బ్లూ డీఈఎఫ్ లిక్విడ్ బకెట్లను రికవరీ చేసి అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు సీఐ జి. వేణు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎస్ఐ రాజేష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply