ఆరుగాలం శ్రమ.. అరిగోస పడుతున్న రైతన్న!

ఆరుగాలం శ్రమ.. అరిగోస పడుతున్న రైతన్న!

  • చౌటుప్పల్‌లో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
  • మిల్లుల వద్ద ‘తరుగు’ దోపిడీ.. క్వింటాలుకు 5 కిలోల అదనం!
  • లారీల కొరత, హమాలీల సమస్యతో నిలుస్తున్న రవాణా
  • సివిల్ సప్లై అధికారులు మిల్లర్లకు వత్తాసు పలుకుతున్నారు: సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
ఆరుగాలం చెమటోడ్చి, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మండే ఎండలో అరిగోస పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల మాయాజాలం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 5, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో 12, స్వచ్ఛంద సంస్థ (పీపీసీ) ఆధ్వర్యంలో 4 చొప్పున మొత్తం 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రాలు కాగితాలకే పరిమితమయ్యాయే తప్ప, ధాన్యం కొనుగోళ్లు మాత్రం వేగవంతం కావడం లేదు. ఇప్పటివరకు కనీసం 25 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది.

ధాన్యం తూకాల విషయంలో మిల్లర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కనబెట్టి, తేమ శాతం (మ్యాశ్చూర్) సరిగ్గా ఉన్నప్పటికీ క్వింటాలుకు 5 కిలోల పైగా అదనంగా తూకం వేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. దీనికి తోడు ఎండ వేడిమికి లారీల్లోనే రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటం వల్ల బరువు తగ్గుతోందని, ఆ భారాన్ని కూడా రైతులపైనే వేస్తూ ‘తరుగు, తాలు’ పేరుతో మరింత దోపిడీకి తెరలేపారు. జిల్లా, మండల సివిల్ సప్లై అధికారులు మాత్రం క్షేత్రస్థాయికి వచ్చి రైతుల బాధలను ఆలకించాల్సింది పోయి, మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యపు బస్తాలను రైస్ మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలు లేకపోవడం సమస్యగా మారింది. ఒకవేళ లారీలు మిల్లుల వద్దకు వెళ్లినా అక్కడ అన్‌లోడ్ చేయడానికి హమాలీలు ముందుకు రావడం లేదు. మిల్లర్లు ఇచ్చే కూలి చాలడం లేదని వారు నిరసన తెలుపుతుండటంతో, దిక్కుతోచని స్థితిలో రైతులు తమ సొంత డబ్బులను అదనంగా చెల్లించి హమాలీలతో అన్‌లోడ్ చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ధాన్యం మిల్లుల వద్ద వెంటవెంటనే అన్‌లోడ్ కాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలకు లారీలు తిరిగి రావడం లేదు. దీంతో కేంద్రాల్లో ఉన్న హమాలీలకు రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే లోడింగ్ చేసే పరిస్థితి ఎదురవుతోంది. దీనివల్ల తమకు కూలి గిట్టుబాటు కావడం లేదని, ఇలాగైతే తాము వేరే పనులకు వెళ్లిపోతామని హమాలీలు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆకాశం మబ్బు పడుతుండటంతో రైతుల్లో వణుకు మొదలైంది. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యపు రాసులు అకాల వర్షానికి తడిసి, మొలకెత్తితే తాము కోలుకోలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు జరిపి, లారీలు, హమాలీల కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ధాన్యం బస్తాలతో జాతీయ రహదారిని దిగ్బంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.

సివిల్ సప్లై డీటీ, డీఎస్ఓలు మిల్లర్లకే వత్తాసు: సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి
చౌటుప్పల్ మండలంలో ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, రైతుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, లోడింగ్, రైస్ మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్యలను, హమాలీల ఇబ్బందులను, అలాగే అదనంగా జరుగుతున్న తరుగు దోపిడీని మండల ఇన్చార్జి, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ (డీటీ), జిల్లా సివిల్ సప్లై అధికారి (డీఎస్ఓ) దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు మిల్లర్లకే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేదంటే వర్షం వస్తే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటిపాలై తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టకపోతే రైతులతో కలిసి ధాన్యం బస్తాలతో జాతీయ రహదారిని స్తంభింపజేస్తామని దామోదర్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply