గుండెల్లో కొలువై.. గూడెంలో నెలవై..

  • ఆదిమ గిరిజన గూడెంలో అభివృద్ధి కిరణాలు..
  • కలెక్టర్‌ చొరవతో మారిన రూపురేఖలు
  • కలెక్టర్‌ రాజర్షి షా పేరుతో ఊరికి కొత్త నామకరణం..
  • ఆనందంలో కొలాం గిరిజనులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ బ్యూరో, ఆంధ్రప్రభ : అభివృద్ధికి ఆమడ దూరంలో.. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ మారుమూల ఆదిమ గిరిజన గూడెంలో ఇప్పుడు అభివృద్ధి కిరణాలు వెలుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు పూరిగుడిసెల్లో జీవనం సాగించిన కొలాం గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్లు, రోడ్లు, ఇంటి పట్టాలు, స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా సంక్షేమ ఫలాల కోసం ఎదురుచూస్తున్న ఆ గూడెం ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి 19 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం పిప్పల్‌దరి గ్రామపంచాయతీ పరిధిలోని దహిగూడలో 17 కొలాం గిరిజన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో గురువారం గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను ప్రత్యేకంగా ఆహ్వానించిన గూడెం వాసులు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు.

కలెక్టర్‌ చొరవతో తమ గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువయ్యాయని ఆనందం వ్యక్తం చేసిన గిరిజనులు.. దహిగూడ పేరును ‘రాజర్షి షా గూడ’గా మార్చారు. ఇకపై తమ ఊరిని అదే పేరుతో పిలుస్తామని ప్రకటించారు. తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన కలెక్టర్‌ రాజర్షి షా, ఇతర అధికారుల సేవలను చిరకాలం గుర్తుంచుకుంటామని తెలిపారు. కొలాం ఆదిమ తెగ సంప్రదాయం ప్రకారం కలెక్టర్‌ కాళ్లు కడిగి, బొట్టు పెట్టి అతిథిగా సాదరంగా ఆహ్వానించారు. భాజాభజంత్రీలతో పండుగ వాతావరణంలో గృహప్రవేశ వేడుకలు నిర్వహించారు.

“కొలాం గూడెం ఆతిథ్యాన్ని మరిచిపోలేను”

దహిగూడ పేరును ‘రాజర్షి షా గూడ’గా మార్చడంపై కలెక్టర్‌ రాజర్షి షా భావోద్వేగానికి గురయ్యారు. గిరిజనులు ఇచ్చిన ఘన స్వాగతం, చూపిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. గ్రామంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన అనంతరం 17 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారులకు పట్టాలు అందించినట్లు తెలిపారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే కార్యక్రమానికి తనను ఆహ్వానించి ఆత్మీయంగా స్వాగతించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు విద్యుత్‌, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌, రవాణా వంటి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

లోఓల్టేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పిప్పల్‌దరి మహిళా సర్పంచ్‌ గంటుబాయి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ డీఈని ఆదేశించారు. సుమారు 280 మంది జనాభా ఉన్న కొలాం గిరిజనుల ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక దృష్టి పెడతామని కలెక్టర్‌ తెలిపారు. జలశ్రీ పథకం కింద పంప్‌సెట్లు ఏర్పాటు చేయడంతో పాటు పాడి పశువులు, మేకల యూనిట్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ అందిస్తామని, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు ఆదిలాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మామిడికొరి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిప్పల్‌దరి గ్రామపంచాయతీ పరిధిలో మరో 10 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

తాగునీటి సమస్యకు పరిష్కారం

తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దహిగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు బోరుబావులను కలెక్టర్‌ ప్రారంభించారు. దీంతో గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయి. కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఓ పీడీ రవీందర్‌ రాథోడ్‌, హౌసింగ్‌ పీడీ శంకర్‌, తహసీల్దార్‌ గోవింద్‌, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులందరికీ గూడెం వాసులు ఘనంగా స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. పూరిగుడిసెల నుంచి పక్కా ఇళ్ల వరకు.. మౌలిక వసతుల నుంచి స్వయం ఉపాధి అవకాశాల వరకు వచ్చిన మార్పు కొలాం గూడెం ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. తమ జీవితాల్లో మార్పుకు కారణమైన కలెక్టర్‌ పేరును ఊరికి పెట్టుకోవడం ద్వారా గిరిజనులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.