రాష్ట్రంలో తీవ్ర నీటి సంక్షోభం
రాష్ట్రంలో తీవ్ర నీటి సంక్షోభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. భానుడు భగభగ మండుతుంటే జలాశయాల్లోని నీరు అడుగంటిపోతుంది. గ్రామీణ ప్రజలు మైళ్ల కొద్దీ నడుస్తూ వాగుల్లో చెలమలు తీసి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. పంటలను కాపాడుకునేందుకు ట్రాక్టర్లతో నీటిని తెచ్చుకుని తడుపుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ పరిస్థితి దయనీయంగా ఉంది. కాళేశ్వరం నీటితో రెండేళ్లుగా చెరువులు, కుంటలు, జలాశయాలను నింపకపోవడంతో నీటి సమస్యలు ఎక్కువయ్యాయి.
శ్రీశైలం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఏపీ తరలించుకుపోవడంతో ప్రస్తుతం శ్రీశైలం అడుగంటిపోతుంది. నాగార్జునసాగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని ప్రధాన, మధ్య తరహా ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో కనిష్ట స్థాయికి నీరు చేరుకోవడంతో డెడ్ స్టోరేజీలోకి నీటి నిల్వలు చేరుకున్నాయి.
తగ్గుతున్న నీటి నిల్వలు
శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 30 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జునసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా కేవలం 25 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.50 టీఎంసీలకు కేవలం 28.85 టీఎంసీలే నిల్వ ఉంది. నిజాంసాగర్‌లో 17.80 టీఎంసీలకు 9.54 టీఎంసీలు, సింగూర్‌లో 29.91 టీఎంసీలకు 7.46 టీఎంసీలు, జూరాలలో 9.66 టీఎంసీల సామర్థ్యానికి గాను కేవలం 3 టీఎంసీలే ఉన్నాయి.
సింగూర్, నిజాంసాగర్ వంటి జలాశయాలు తాగునీటి అవసరాలకు కీలకం కాగా.. వీటిలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. మరో నెలరోజులకు సరిపడ నీరు మాత్రమే ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముందస్తు ప్రణాళిక లేకే…
గతేడాది సమృద్ధిగా వర్షాలు కురిసినప్పటికీ ఆ నీటిని ఒడిసిపట్టి చెరువులు, కుంటలు, జలాశయాల్లో నింపకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, నెట్టెంపాడు, నిజాంసాగర్‌తో పాటు శ్రీరాంసాగర్, కడెం, కల్వకుర్తి, ఎల్లంపల్లి వంటి అనేక జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.
సింగూరు మరమ్మతుల కోసం నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో కేవలం 9 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాల కోసం ఉన్నాయి. రాబోయే కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దని పక్షంలో భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెక్‌డ్యాంల నిర్వహణ లోపాలతో నీటిని నిల్వ చేయకపోవడంతో భూగర్భ జలాలు అందనంత దూరం వెళ్లాయి. ఫలితంగా బోరుబావుల్లో నీరు అందుబాటులో లేదు. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల బోరుబావుల కింద వ్యవసాయం జరుగుతోంది. 250 టీఎంసీల నీరు బోరుబావుల ద్వారా పంటపొలాలకు అందాల్సి ఉండగా, బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడంతో ట్యాంకర్లతో నీటిని తెచ్చి పంటలను రక్షించుకుంటున్నారు.
