DGP CV Anand | ప్రస్తుత పోలీసింగ్ పై సీఎం అసంతృప్తి..

DGP CV Anand | ప్రస్తుత పోలీసింగ్ పై సీఎం అసంతృప్తి..
- యూనిట్ ఆఫీసర్లు పనితీరు మార్చుకోండి
- పారదర్శకంగా పోస్టింగులు
- లాఠీలు చేతిలో ఉండాల్సిందే
- వీడియో కాన్ఫరెన్స్ లో డిజిపి సివి ఆనంద్
హైదరాబాద్ ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సరైన పోలీసింగ్ లేదని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ తెలియజేశారు. శనివారం రాష్ట్రంలోని ఎస్ హెచ్ఓ స్థాయి నుండి పై స్థాయి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రభుత్వం కోరుకున్న విధంగా ప్రస్తుతం పోలీసింగ్ లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. యూనిట్ అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు బాధ్యతాయుతంగా పనిచేయడం లేదని, అనేక ఆరోపణలు వస్తున్నాయన్నారు.
యూనిట్ ఆఫీసర్లు జాగ్రత్త..
జిల్లాల యూనిట్ అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉండటం లేదని, ఇక పై హెడ్ క్వార్టర్ వదిలి ఇష్టానుసారంగా వెళ్తే చర్యలు తప్పవన్నారు. పర్సనల్ ఇంటెగ్రిటీ పై దృష్టి సారిస్తానని, తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు. వెంటనే పని తీరు మార్చుకోవాలని జవాబుదారితనంతో పనిచేయాలని స్పష్టంగా తెలియజేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. తప్పు చేస్తే సస్పెన్షన్ ఉత్తర్వులు వస్తాయన్నారు. రాబోయే రోజుల్లో పోస్టింగులు చాలా పారదర్శకంగా ఉంటాయని పనితీరు ఆధారంగా పోస్టింగ్లు లభిస్తాయన్నారు.
యూనిఫామ్ కు మచ్చ తేవద్దు..
ప్రజా ప్రతినిధులతో రాజ్యాంగ బద్దమైన మర్యాదగా వ్యవహరించాలని, అలాగని యూనిఫాంను తాకట్టు పెట్టవద్దన్నారు. పోలీస్ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించవద్దన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించాలని, సమస్యలతో పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులతో మర్యాద గా వ్యవహరించాలన్నారు.
చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే లాఠీలకు పని చెప్పండి..
బందోబస్తు లో ఉండే ప్రతి సిబ్బంది చేతిలో లాఠీ ఉండాల్సిందే. బందోబస్తు సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే లాఠీలకు పని చెప్పాల్సిందే అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.
ప్రతి నెల నేర సమీక్షలు తప్పనిసరి…
ప్రతీ నెల నేర సమీక్షలు తప్పని సరిగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రతినెల విధిగా నేర సమీక్షలు నిర్వహించి పోలీస్ స్టేషన్ల వారిగా జరుగుతున్న నేరాలు నమోదైన కేసుల పట్ల క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలన్నారు. రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ బ్యూరో డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో పై త్వరలో జీవోలు వస్తాయన్నారు. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కచ్చితంగా డ్రగ్స్ కంట్రోల్ కమిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎలాంటి డ్రగ్స్ సమాచారం ఉన్న పోలీసులకు తెలిపే విధంగా కమిటీ పని చేసేలా చర్యలు తీసుకోవాలి.
