Kolikapudi | అసెంబ్లీకి కూడా ఓసారి రావొచ్చుగా సామీ..!

శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వెళ్తున్నారు..
పక్కనే ఉన్న అసెంబ్లీకి మాత్రం రావడం లేదా?
వాట్సాప్‌ వేదికగా మాజీ సీఎం జగన్‌పై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి సెటైర్లు


Kolikapudi | (విజయవాడ, ఆంధ్రప్రభ) : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సామాజిక మాధ్యమ వేదికగా సెటైర్లు వేశారు. జగన్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ తన వాట్సాప్‌ స్థితిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

‘‘ఆ చివర ఉన్న శ్రీకాకుళం వెళ్లావు.. ఈ చివరన ఉన్న కర్నూలు వెళ్లావు.. ఇంటి పక్కన ఉన్న అసెంబ్లీకి కూడా ఓ తూరి రావొచ్చుగా సామీ..’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్‌ స్టేటస్ లో పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ హాజరు కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొలికపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీకాకుళం, కర్నూలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్ర రాజధాని ప్రాంతానికి సమీపంలోనే ఉన్న అసెంబ్లీకి మాత్రం ఎందుకు రావడం లేదన్న భావనతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.