ఉమామహేశ్వరంలో మహా వరుణ యాగం

వానల కోసం.. వరుణ యాగం
ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతుల ప్రత్యేక పూజలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం మహా వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి డాక్టర్ చిక్కుడు అనురాధ దంపతులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నల్లమల అడవుల మధ్య ప్రకృతి రమణీయత నడుమ కొలువైన ఉమామహేశ్వర క్షేత్రానికి ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మహా వరుణ యాగాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సభ్యులు యాగానికి ఏర్పాట్లు చేశారు. వేద పండితులు, ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మూడు గంటలపాటు జలదిగ్బంధంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.