రాయలసీమలో సువర్ణ అధ్యాయం ప్రారంభం

జొన్నగిరిని ‘స్వర్ణగిరి’గా తీర్చిదిద్దుదాం: సీఎం చంద్రబాబు

గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రాయలసీమ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుంది

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ చరిత్రలో బుధవారం ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, త్రివేణి ఎర్త్ మూవర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, విస్తరణ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రతనాల సీమగా పేరుగాంచిన రాయలసీమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలో ప్రారంభం కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థల యాజమాన్యానికి, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.

జొన్నగిరి కాదు… స్వర్ణగిరి

జొన్నగిరి చరిత్ర నేటిది కాదని, శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతాన్ని ‘సువర్ణగిరి’గా పిలిచేవారని చంద్రబాబు గుర్తు చేశారు. అశోక చక్రవర్తి నాలుగు రాజధానుల్లో ఒకటిగా ఈ ప్రాంతం ఉండేదని, సమీపంలోని ఎర్రగుడి శాసనాలు ఆ వైభవానికి నిదర్శనాలని పేర్కొన్నారు. గతంలో రత్నాలు, బంగారంతో వెలుగొందిన ఈ ప్రాంతానికి మళ్లీ ఆ గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో జొన్నగిరి పేరును ‘స్వర్ణగిరి’గా మార్చుకోవాలని ప్రతిపాదించారు.

రూ.405 కోట్ల పెట్టుబడి

జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఇప్పటికే రూ.405 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో ఏటా 400 కిలోల బంగారం ఉత్పత్తి ప్రారంభమై, క్రమంగా ఒక టన్ను, తదుపరి దశల్లో భారీ స్థాయిలో ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. దేశం ప్రస్తుతం ఏటా వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోందని, దేశీయ ఉత్పత్తి పెరగడం ద్వారా విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందన్నారు.

స్థానిక యువతకు ఉపాధి

గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. గనుల కార్యకలాపాలు, రవాణా, యంత్రాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

స్వర్ణాంధ్ర లక్ష్యం

2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్‌ను ‘స్వర్ణాంధ్ర’గా తీర్చిదిద్దాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు తెలిపారు. స్వర్ణగిరి గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని, రాయలసీమను తిరిగి ‘రతనాల సీమ’గా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు గురించి చర్చ జరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి భారీ ప్రణాళికలు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై పలు కీలక ప్రకటనలు చేశారు. జొన్నగిరిలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి ఆభరణాలుగా తయారు చేసే బదులు, స్థానికంగానే జ్యుయలరీ పార్కు ఏర్పాటు చేసి విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పరిశ్రమకు అవసరమైన అనుమతులు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ను కేవలం అన్నపూర్ణగానే కాకుండా రత్నగర్భగా కూడా అభివర్ణించిన సీఎం, రాష్ట్రంలో మంగంపేట బెరైటీస్, కడప లైమ్‌స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పం గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళం బ్లూ గ్రానైట్, గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలోని బీచ్ శాండ్, అనంతపురం–కడప జిల్లాల్లో ఐరన్ ఓర్, కేజీ బేసిన్‌లో గ్యాస్, పెట్రోలియం వంటి అపార ఖనిజ సంపద ఉందన్నారు. ఈ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు వాల్యూ ఎడిషన్ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

రాయలసీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న చంద్రబాబు, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

అనంతపురం జిల్లాకు గతంలో కియా పరిశ్రమను తీసుకొచ్చామని, ప్రస్తుతం 5వ తరం ఫైటర్ జెట్ తయారీ ప్రాజెక్టును కూడా తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి, 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.