StockMarket | సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్

StockMarket | సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్

StockMarket | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం, ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో సానుకూల ప్రభావం చూపాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఉదయం ప్రారంభ సమయానికి సమయానికి BSE Sensex 1,003 పాయింట్లు లాభపడి 74,836 వద్ద కొనసాగుతుండగా, Nifty 50 285 పాయింట్లు ఎగబాకి 23,446 వద్ద ట్రేడవుతోంది.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలమైన ర్యాలీని నమోదు చేస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

గత కొన్ని రోజులుగా భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, తాజా పరిణామాలతో తిరిగి కోలుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు కొంత మేర తగ్గడం, ముడి చమురు ధరలు స్థిరంగా ఉండటం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగితే దేశీయ సూచీలు మరింత లాభపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.