అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

  • స్టేట్ మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచితంగా మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ కలెక్షన్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు రూ 2 కోట్ల 33 లక్షల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ కోఆపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జిల్లా పరిషత్ సీఈఓ సాయగౌడ్, భీంగల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ బోదిరే లావణ్య, సంటి లత, కౌన్సిలర్లు పర్శ కుశలత, ఆరెపల్లి శ్రీజ, నాగేంద్ర, సంగ్యా నాయక్, సర్పంచ్లు ఆరిగేల జనార్దన్, కుంట రమేష్, వన్నెల జనార్దన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, పర్శ అనంత్ రావు మహిళా నాయకురాలు కల్పన, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, అన్ని మండలాల ఏపీవోలు, ఏపీఎం లు ఇతర సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.