కళ్యాణలక్ష్మి పథకం యథావిధిగా కొనసాగించాలి
తులం బంగారం హామీని అమలు చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వంపై వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజం
వేల్పూర్, ఆంధ్రప్రభ: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని తెలిపారు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చినా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ప్రస్తుతం పేదల ఆడబిడ్డలకు అండగా ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించడంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమానికి సంబంధించిన పథకాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పథకాల రద్దుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదల సంక్షేమ పథకాలను కొనసాగించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీ నాయకులు తెలిపారు.
