శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం..

శంకరాచార్యుల అద్వైత సిద్ధాంతం అనుసరణీయం..
అలరించిన గుంటుపల్లి మోహనకృష్ణ ఆధ్యాత్మిక ప్రవచనం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా మంగళవారం దేవస్థాన కళా వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ఆధ్యాత్మిక ప్రవచనకర్త గుంటుపల్లి మోహనకృష్ణ “ఆదిశంకరుల వైభవం” అనే అంశంపై భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఉద్ధరించారో, వారు రచించిన స్తోత్రాలు, భాష్యాల ప్రాముఖ్యతను మోహనకృష్ణ వివరించారు.

భారతీయ తత్వశాస్త్రంలో శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని, నేటి సమాజానికి దాని ఆవశ్యకతను సులభ శైలిలో భక్తులకు వివరించారు. హైందవ ధర్మ పరిరక్షణకు దేశం నలుమూలల నాలుగు పీఠాలను స్థాపించి, సాంస్కృతిక సమైక్యతకు వారు చేసిన కృషిని కొనియాడారు. ప్రవచనకర్తను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు సత్కరించారు.
ఈ ఆధ్యాత్మిక ప్రవచనాన్ని వినడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదిశంకరుల వారు అమ్మవారిపై రచించిన సౌందర్య లహరి, కనకధారా స్తోత్రాల విశిష్టతను వివరిస్తున్న సమయంలో కళావేదిక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. ఆదిశంకరాచార్యులు చూపిన ధర్మ మార్గం మానవాళికి దిక్సూచి. వారి బోధనలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.” అని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రవచనాన్ని ఆస్వాదించారు.
