గ్రూప్ హియరింగ్ సిస్టమ్ ప్రారంభం..

  • పరివర్తన్ ప్రత్యేక పాఠశాలలో గ్రూప్ హియరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన ఎస్పీ
  • వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ

ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరులోని దొండపాడులో ఉన్న పరివర్తన్ ప్రత్యేక పాఠశాలలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్రూప్ హియరింగ్ సిస్టమ్ ప్రారంభోత్సవం, హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ గ్రూప్ హియరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించి, వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు హియరింగ్ ఎయిడ్స్ అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, సరైన అవకాశాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు, నాణ్యమైన విద్య అందితే ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అన్నారు.

గ్రూప్ హియరింగ్ సిస్టమ్ ద్వారా ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు మరింత స్పష్టంగా వినిపించడంతో పాటు వారి అభ్యాస సామర్థ్యం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతాయని ఎస్పీ పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను సమాజం ప్రేమతో, గౌరవంతో ఆదరించాలని, వారి ప్రతిభను వెలికితీయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

అమెరికాలో స్థిరపడిన ప్రముఖ దాతలు రావెళ్ల కిషోర్ ప్రసాద్, శ్రీమతి స్వర్ణ దంపతుల ఉదార సహకారంతో గ్రూప్ హియరింగ్ సిస్టమ్, హియరింగ్ ఎయిడ్స్ అందుబాటులోకి రావడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశంలోని ప్రత్యేక చిన్నారుల పట్ల వారు చూపుతున్న సేవాభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ విలువైన సహాయం అందించిన దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ మురళి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ చూపుతున్న చొరవ ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.